టన్నుల కొద్దీ పుత్తడి రవాణా
లండన్ నుంచి రూ.వందల కోట్ల విలువైన బంగారం (Gold) తరలిపోతోంది. అదంతా అమెరికా బ్యాంకుల్లో పోగవుతోంది. అమెరికా మిత్రులైన ఐరోపా దేశాలపైనా సుంకాలు విధిస్తానని డొనాల్డ్ ట్రంప్ నుంచి హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో టన్నుల కొద్దీ పుత్తడి రవాణా అవుతోంది.
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై 25శాతం సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించారు. బంగారంపై కూడా టారిఫ్‌లు విధించొచ్చన్న ఆందోళనలు ఉన్నాయి. ఇవన్నీ లోహ పరిశ్రమలో ఒత్తిడికి దారితీశాయి. దాంతో లండన్‌లో బంగారం విలువ పతనమవుతుండగా.. న్యూయార్క్‌లో మాత్రం ధర ఆకాశన్నంటుతుంది. ట్రంప్ సుంకాల బెదిరింపుల నేపథ్యంలో లండన్‌లో 20 డాలర్ల మేర క్షీణించింది. మరోవైపు అమెరికాలో ఔన్సు బంగారం 3000 డాలర్లకు చేరువవుతోంది. ఈ పరిణామాలతో అమెరికా దిగ్గజ బ్యాంకులు అప్రమత్తమయ్యాయి. జేపీ మోర్గాన్ చేజ్, హెచ్‌ఎస్‌బీసీ వంటి ప్రధాన బ్యాంకులు.. లండన్‌లో వాల్ట్‌ల నుంచి తమ పసిడి నిల్వలను శరవేగంగా విమానాల్లో స్వదేశానికి తెచ్చుకుంటున్నాయి.
లండన్‌లోని థ్రెడ్ నీడిల్ స్ట్రీట్‌లోని తొమ్మిది వాల్ట్స్‌లో వందల టన్నుల బంగారం నిల్వ ఉంటుంది. దాని విలువ 252 బిలియన్ డాలర్లు మేర ఉంటుంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం నిల్వ ఇది. ట్రేడ్ వార్ భయాల నేపథ్యంలో ఈ ఒక్క నెలలోనే 4 బిలియన్ డాలర్ల బంగారాన్ని తరలించాలని జేపీ మోర్గాన్ ప్లాన్ చేస్తోంది. 2020లో కరోనా కారణంగా స్విస్ రిఫైనరీలు మూతపడిన సమయంలో ఇలాంటి తరలింపు చోటుచేసుకుంది. మరోవైపు, అమెరికా ఎన్నికల రోజు నుంచి అగ్రరాజ్యానికి పుత్తడి రాక విపరీతంగా పెరిగింది. గత నవంబర్ 5 నాటికి అమెరికాలో 50 బిలియన్ డాలర్ల పసిడి నిల్వలు ఉండగా.. ఇప్పుడు అది 106 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
గత ఏడాది మేలో ఇంగ్లాండ్ నుంచి భారీఎత్తున బంగారం నిల్వలను ఆర్‌బీఐ (RBI) భారత్‌కు తరలించిన సంగతి తెలిసిందే. దాదాపు 100 టన్నులు అంటే లక్ష కిలోల పసిడిని దేశీయ ఖజానాలో చేర్చారు. రవాణా, నిల్వ సర్దుబాట్లలో భాగంగానే భారత్ ఇంతమొత్తం బంగారాన్ని తీసుకొచ్చింది. దేశీయంగా ముంబయి మింట్ రోడ్డు సహా నాగ్‌పుర్‌లోని పాత కార్యాలయాల్లో ఆర్‌బీఐ పుత్తడిని నిల్వ (Gold Reserves) చేస్తుంటుంది. కొన్నేళ్లుగా కేంద్ర బ్యాంకు పెద్దఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తూ వస్తోంది. దీన్ని ఎక్కడ నిల్వ చేయాలనేది ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో విదేశాల్లోని మన నిల్వలు గణనీయంగా పెరిగాయి. దీంతో కొంత మొత్తాన్ని భారత్‌కు తీసుకురావాలని నిర్ణయించింది.