టర్కీలో సైనిక తిరుగుబాటు: 60 మంది మృతి
అంకారా: అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు సైన్యంలోని ఓ వర్గం టర్కీలో తిరుగుబాటుకు యత్నించింది. దీంతో టర్కీ రణరంగంగా మారింది. దేశాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సైన్యం ప్రకటించినా.. ఆతర్వాత కొద్దిసేపటికే పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు టర్కీ ప్రధాని వెల్లడించారు. దీంతో దేశ వ్యాప్తంగా మార్షల్ చట్టం, కర్ఫ్యూ విధించారు. రాజధాని అంకారా గగనతలంలో సైనిక విమానాలు, హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. ఇస్తాంబుల్, అంకారా తదితర ప్రధాన పట్టణాల్లో సైనిక ట్యాంకులు తిరిగాయి. పార్లమెంట్ భవనం సమీపంలోని పలు కీలక ప్రాంతాల్లో సైన్యం పేలుళ్లకు పాల్పనట్లు స్థానిక మీడియా తెలిపింది.
నిరంకుశ పాలన, పెరిగిన ఉగ్రవాదం కారణంగానే అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని భావించినట్లు సైన్యంలోని ఓ వర్గం వెల్లడించింది. టర్కీ అధికారిక ఛానల్, రేడియా కార్యాలయాలను స్వాధీనం చేసుకునేందుకు సైనిక అధికారి, నలుగురు సైనికులు విఫలయత్నం చేశారు. తీవ్రంగా ప్రతిఘటించిన పోలీసులు సైనిక అధికారి, నలుగురు సైనికులను హతమార్చారు. తిరుగుబాటుకు యత్నించిన ఒక జనరల్‌ను పోలీసులు హతమార్చారు. మరో 754 మంది సైనికులను అదుపులోకి తీసుకున్నారు. ఇస్తాంబుల్‌లోని టక్‌సిమ్ స్వే్కర్ వద్ద పోలీసులు, సైన్యం మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు మృతి చెందారు. సైన్యం జరిపిన దాడుల్లో ఇప్పటి వరకూ 17మంది పోలీసులు సహా 60 మంది మృతిచెందారు. తిరుగుబాటు చేసిన సైన్యం ఉపయోగించిన యుద్ధవిమానాన్ని వెంటనే కుప్పకూల్చాలని టర్కీ సైన్యానికి ప్రధాని ఆదేశాలు జారీ చేశారు.