టిటిడి ఛైర్మన్‌ పదవిపై పెరుగుతున్న పోటీ

టిడిపిలో ఎక్కువ మంది దృష్టి దీనిపైనే
త్వరగా నిర్ణయం తీసుకోలేక పోతున్న బాబు
అమరావతి,ఆగస్ట్‌14 (జనం సాక్షి):ఎపిలో టిడిపి కూటమి ప్రభుత్వంలోకి రావడంతో ఇంతకాలం పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ఆశలు పెరిగాయి. నామినేటెడ్‌ పదవుల పంపిణీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేరు. అందుకే పదవుల పందేరం ఇంకా ఒక కొలిక్కి రావడం లేదు. మూడు పార్టీల్లో ఆశావహులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో, ఏ పదవి ఎవరికివ్వాలనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఒక పక్క సామాజిక న్యాయం పాటిస్తూనే, ప్రాంతాల ప్రాధాన్యాలు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. కీలక పదవులు ఇప్పటికే కొన్ని ఉత్తరాంధ్రకు దక్కాయి. అయితే మరిన్ని పదవులు కట్టబెట్టడం ద్వారా ఉత్తరాంధ్రలో సైకిల్‌ స్పీడ్‌ ని ఇంకా పెంచాలన్నదే టీడీపీ పెద్దల వ్యూహం అని అంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ పదవి చాలా ప్రతిష్టాత్మకమైనది. ఈ పదవి కోసం ఎంతోమంది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే భక్తితో పాటు, బలమైన సంకత్పం ఉన్నవారే తిరుమల అభివృద్దికి కృషి చేయగలరు. దీనిని రాజకీయ పదవిగా చూడడానికి లేదు. అలాంటి ఈ పదవి.. ఎపుడూ ఉత్తరాంధ్ర జిల్లాలకు దక్కలేదు. గోదావరి జిల్లాల దాకానే వచ్చి ఆగిపోయింది. ఈసారి అయినా ఉత్తరాంధ్రకు దక్కుతుందా అన్నచర్చకు తెర లేస్తోంది. ఈ కీలక పదవి కోసం టీడీపీకి చెందిన సీనియర్‌ నేత, మాజీ ఏపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు పేరు పరిశీలనలో ఉందని వార్తలు వస్తున్నాయి. ఆయన 1983 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. టీడీపీలో సీనియర్‌ నేతగా ఉన్నారు. ఈసారి గెలిచి మంత్రి అవుదామని అనుకున్నారు. కానీ అది జరగలేదు. దాంతో ఆయనకు ఈ పదవి ఇస్తారని ప్రచారం సాగుతోంది. బీసీ కాపు నేతగా ఉన్న కళాకు ఈ పదవిని ఇవ్వడం ద్వారా, ఉత్తరాంధ్రలో మరింత పట్టు సాధించవచ్చునని, రానున్న కాలంలో విజయనగరం జిల్లా రాజకీయాల్లో కూడా, టీడీపీ మరింత పటిష్టం అవుతుందని, ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. అలాగే, టీటీడీ బోర్డు మెంబర్‌ పదవిని, ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ కి ఇస్తారని మరో ప్రచారం సాగుతోంది. ఆయన కూడా మంత్రి పదవిని ఆశించారు. బలమైన బీసీ నేతగా ఉన్నారు. అలాగే, ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌ కుమార్‌ కి, ఎస్టీ చైర్మన్‌ పదవి ఇస్తారని కూడా ప్రచారంలో ఉంది. ఇలా మూడు జిల్లాల నుంచి ముగ్గురికీ న్యాయం చేస్తారని అంటున్నారు. అయితే ఇలా ఉండగా మరోపక్క ఉత్తరాంధ్రాకే సీనియర్‌ గా ఉన్న రాజవంశీకులు కుటుంబం నుంచి అశోక గజపతిరాజు పేరు ప్రతిపాదించాలని ఇప్పటికే అధిష్టానం వద్దకు వెళ్లిందని సమాచారం. ఇప్పటికే చాలా ఆలయాలకు వాళ్లు ట్రస్టీలుగా ఉండడం ఎన్నో ఆలయాలు నిర్మాణం చేయడంలో వారికి వారే సాటి లేరు. బీజేపీలో ఉన్న కొంతమంది సీనియర్లు అదేవిధంగా జనసేన
పార్టీ నుంచి ఉన్న కొంతమంది పేర్లు కూడా ఇప్పటికే అధిష్టానం వద్దకు పరిశీలనకు వెళ్లాయని.. అయితే నామినేటెడ్‌ పదవులతో పాటు ఇప్పుడు టిటిడి బోర్డు మెంబర్‌ విషయంలో పెద్ద తలనొప్పిగా మారిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి స్వాతంత్ర సమరయోధులు కుటుంబం నుంచి వచ్చిన గౌతు శ్యాంసుందర్‌ శివాజీ కూడా టీటీడీ చైర్మన్‌ ఇస్తారని ఊహాగానాలైతే వినిపిస్తున్నాయి. మరో పక్కన శ్రీకాకుళం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీని నమ్ముకున్న గుండా ఫ్యామిలీలో ఒకరికి టిటిడి చైర్మన్‌ ఇస్తారని ఇలా ఊహాగానాలనేవి ఎక్కువగా వస్తున్నాయి సో అధిష్టానం ఎలా నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.