టిడిపి లేకుంటే కెసిఆర్‌ అడ్రస్‌ ఎక్కడ


ఇక్కడ పెరిగి టిడిపినే విమర్శిస్తావా?
తనను అదేపనిగా విమర్శించడంలో అర్థం లేదు
విజయనగరం సభలో మండిపడ్డ చంద్రబాబు
విజయనగరం,నవంబర్‌27(జ‌నంసాక్షి):  తెలుగుదేశం పార్టీయే లేకుంటే కెసిఆర్‌ ఎక్కడుండేవారని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. టిడిపిలో రాజకీయ తీర్థం పుచ్చుకుని ఎదిగిన కెసిఆర్‌ ఇప్పుడు
టిడిపిపైనే విమర్వలకు దిగడం ఆశ్చర్యంగా ఉందన్నారు.  తనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థంకావడం లేదని కూడా చంద్రబాబునాయుడు అన్నారు. తెలంగాణకు తాను అన్యాయం చేయలేదని, ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వారిలో తానే ముందు వరుసలో నిలిచానని చెప్పారు. మంగళవారం ఆయన విజయనగరంలో నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో మాట్లాడారు. తాను ఏనాడూ కేసీఆర్‌ను తిట్టలేదని ఆ అవసరం కూడా తనకు లేదన్నారు. కానీ ఆయన తనను అంటుంటే మాత్రం బాధేస్తోందన్నారు. తెదేపా లేకపోతే కేసీఆర్‌ ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. కేసీఆర్‌ తెదేపా నుంచి రాలేదా? మహానేత ఎన్టీఆర్‌ పార్టీ పెట్టకపోతే కేసీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చేవారా? అని అన్నారు. తెదేపా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పెట్టిన పార్టీ అని, పేదల పార్టీ అని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోనే  కాకుండా ప్రపంచంలో ఎక్కడ తెలుగువారికి కష్టం వచ్చినా అండగా నిలబడే జెండా తెదేపా జెండా అన్నారు. తెలంగాణలో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ అనేక విద్యా సంస్థలు నెలకొల్పి విద్యా వికాసానికి తోడ్పాటునందించానని గుర్తుచేసుకున్నారు.
హైదరాబాద్‌ నేనే కట్టానని చెప్పలేదు
తెలంగాణలో ఎన్నికలు వచ్చాయని, అక్కడ ప్రజాకూటమి కట్టడం న్యాయం కాదా? అని ప్రజలను అడిగారు. హైదరాబాద్‌ నగరాన్ని తానే కట్టానని ఎక్కడా చెప్పలేదని.. దాన్ని కులీ కుతబ్‌షా కట్టాడన్నారు. సైబరాబాద్‌ను తానే కట్టానన్నారు. అందుకోసం అడుగడుగునా కష్టపడ్డానని, ప్రపంచమంతా తిరిగానని, కాలినడకన తిరిగి పట్టుదలతో ఉక్కు సంకల్పంతో పనిచేశానని గుర్తుచేశారు. మైక్రోసాప్ట్‌, ఐటీ కంపెనీలు, ఐఎస్‌బీ, అంతర్జాతీయ విమానాశ్రయం తానే తీసుకొచ్చినట్టు చెప్పారు. తెలంగాణలో అనేక పాఠశాలలు, కళాశాలలు తెదేపా హయాంలో ఏర్పాటు చేసినవేనన్నారు. అందుకే తెలంగాణపై తెదేపాకు హక్కు ఉందన్నారు.
కేసీఆర్‌ అంటే జగన్‌, పవన్‌కు భయం
కేసీఆర్‌కు పవన్‌, జగన్‌ మద్దతు ఇవ్వడం న్యాయమా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాలకు తెరాస చేసిందేవిూ లేదని, చేయబోయేది కూడా ఏవిూ ఉండదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెరాసకు వైకాపా మద్దతిస్తోందని, పవన్‌ తెలంగాణలో పోటీచేయడం లేదని కేసీఆర్‌ అంటే వాళ్లకు భయమన్నారు. కేవలం ఆంధ్రాలోనే పెత్తనం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఈరోజు రెండే రెండు ఫ్రంట్‌లు ఉన్నాయని, అవి భాజపా నేతృత్వంలో ఎన్డీయే ఫ్రంట్‌ ఒకటి కాగా.. రెండోది భాజపా వ్యతిరేక ఫ్రంట్‌ మాత్రమే ఉన్నాయన్నారు. దేశంలో మూడో ఫ్రంటే లేదని చెప్పారు. దేశంలో అసహనం పెరిగిపోయిందని, దాడులు పెరిగిపోతున్నాయని, ప్రత్యర్థులను అణిచివేసే ధోరణులు చోటుచేసుకుంటున్నాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తంచేశారు. ఇకపోతే  జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.75వేల కోట్లు రావాలని నిపుణుల కమిటీ ద్వారా చెప్పారని, ఆ తర్వాత ఆయన నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదని విమర్శించారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడితే దేశంలో భూకంపం వస్తుందన్న పవన్‌ ఈ రోజు కేంద్రంపై ఎక్కడా మాట్లాడటంలేదన్నారు. దేశంలో ఇన్ని పరిణామాలు జరుగుతుంటే ఆయన ఎందుకు మాట్లాడరని నిలదీశారు.