టీడీపీకి ఉద్యమ భయం !

– ‘రెండు కళ్ల’ సిద్ధాంతంపై అంతర్మథనం
– త్వరలోనే ఈ వైఖరికి అంతం
– తెలంగాణలో వరుస ఓటములే నిర్ణయ కారకం
– తాము లేఖ ఇవ్వకుండానే రాష్ట్రం వస్తే దుకాణం ఎత్తేయాల్సి వస్తుందన్న భయం
– స్పష్టమైన వైఖరి తెలుపాలని ‘బాబు’పై ఒత్తిడి పెంచుతున్న టీటీడీపీ ఫోరం

హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి):
తెలుగుదేశం పార్టీ తన వైఖరి మార్చుకోనుందా ? నిన్నటి రాష్ట్రపతి ఎన్నిక వరకు రెండు కళ్ల సిద్ధాంతం అవలంబించిన ఆ పార్టీ అధినేత ఇప్పుడు అదే తమ కొంపముంచిందని భావిస్తున్నారా ? తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నారా ? ఆ పార్టీలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే ఇదంతా నిజమేననిపిస్తోంది. ఎవరి మాటా వినని ఆ పార్టీ అధినేత తమ వైఖరిలో మార్పు రావాలని ఆలోచించడం వెనుక ఆ పార్టీకి తెలంగాణ ఉద్యమ భయం పట్టుకోవడమే కారణమని స్పష్టమవుతోంది. అప్పట్లో తెలంగాణ, సీమాంధ్ర తనకు రెండు కళ్లలాంటివన్న చంద్రబాబు నాయుడు, ఇప్పుడు తన చూపొక్కటేనని ప్రకటించేందుకు సిద్ధపడుతున్నారట ! తన రెండు కళ్ల సిద్ధాంతమే పార్టీని ఇటు తెలంగాణలో, అటు సీమాంధ్రలో అస్థిత్వం కోల్పోయే స్థితికి తెచ్చిందని బాబు మదనపడుతున్నారని విశ్వసనీయం సమాచారం. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో టీడీపీ రెండు ప్రాంతాల్లోనూ డిపాజిట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా, తెలంగాణలో కాకున్నా సీమాంధ్రలో తమ పట్టు సడలదన్న భరోసాతోనే టీడీపీ అధినేత నాడు రెండు కళ్ల సిద్ధాంతాన్ని తెర పైకి తెచ్చారు. కానీ, తెలంగాణతోపాటు సీమాంధ్రలోనూ పార్టీ తీవ్రంగా నష్టపోయింది. అక్కడ టీడీపీ స్థానాన్ని వైఎస్సార్సీపీ ఆక్రమించుకుంది. దీంతో టీడీపీ పరిస్థితి రెండింటికి చెడ్డ రేవడిలా తయారైంది. ఇంత కాలం ఎప్పుడు తెలంగాణ అంశం చంద్రబాబు ముందుకు వచ్చినా కేంద్రం కోరితే లేక ఇస్తామని, ఎప్పుడో ఇచ్చేశామని, మిగతా పార్టీలిస్తే ఇస్తామని సమాధానాన్నిదాటవేస్తూ వచ్చారు. ఇదే వైఖరి టీడీపీ కంచుకోటలుగా పేరుబడ్డ నియోజకవర్గాలు సైతం బీటలు వారే పరిస్థితి తెచ్చింది. ఇదే వైఖరి వల్ల పార్టీ నుంచి వలసలు కూడా పెరిగాయి. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ మనుమడు జూనియర్‌ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా అనూహ్యంగా చంద్రబాబుకు ఎదురుతిరిగారు. ఇలాంటి ఎన్నో పరిణామాలు సీమాంధ్రలోనూ టీడీపీని నిర్వీర్యం చేశాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే డిసెంబర్‌ 9న తెలంగాణ అనుకూల ప్రకటన వెలువడ్డ తెల్లారే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రకటన వెనక్కు తీసుకెళ్లేలా ఒత్తిడి చేశారన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని టీడీపీ నాయకులు ఎంత కాదని వాదించినా తెలంగాణ ప్రజలు నమ్మలేదు. చంద్రబాబు ఏదో ఒక పర్యటన పేరుతో తెలంగాణలో తిరగాలని చూసినా, తెలంగాణవాదులు అడుగడుగునా అడ్డుకుని నిరసనలు తెలిపారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరిని తెలుపాలని పట్టుబట్టారు. దీంతో చంద్రబాబు తెలంగాణలో తిరగాలన్న ఆలోచన కూడా మానుకున్నారని కొన్ని రోజుల కింద ఊహాగానాలు వెల్లువెత్తాయి. చంద్రబాబు తెలంగాణ ప్రజలను తాము వ్యతిరేకం కాదంటూ ఎన్ని ప్రకటనలు చేసినా నమ్మే వారు లేకుండా పోయారు. ఆఖరికి తెలంగాణ టీడీపీ ఫోరాన్ని ఏర్పాటు చేసి, తెలంగాణ కోసం ఆ ఫోరం పోరాడుతుందని ఢంకా బజాయించి చెప్పినా తెలంగాణ ప్రజలు నమ్మలేదు. ఆ ఫోరం నాయకులు కూడా తమ సొంత నియోజకవర్గాల్లో తిరగలేని పరిస్థితి వచ్చింది. ఈ పరిణామాలతో ఇంత కాలానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు కళ్లు తెరుచున్నాయి. అందుకే, ఇక రెండు కళ్ల సిద్ధాంతానికి చెక్‌ పెట్టి, ఏ విషయంపైనైనా స్పష్టమైన వైఖరి చెప్పాలని భావిస్తున్నారని, ఇదే విషయాన్ని తనను కలుస్తున్న నాయకులకు కూడా చెబుతున్నారని తెలిసింది. ఇందులో భాగంగానే తెలంగాణ అంశంపై తేల్చేయాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అందుకే, సీమాంధ్రలో పోటీ తీవ్రంగా ఉన్నందున, తెలంగాణలోనే తమ పార్టీ భవిష్యత్తును నిర్ణయించుకోవాలని బాబు ఆలోచిస్తున్నట్లుంది. దీనికి అనుగుణంగానే తెలంగాణకు అనుకూలంగా చిదంబరానికి లేఖ ఇవ్వడానికి సిద్ధపడినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.