టీడీపీలో తేలని జమ్మలమడుగు పంచాయతీ

-ఎమ్మెల్యే కోసం ఆదినారాయణరెడ్డి, సుబ్బారెడ్డి పట్టు

– అధినేతతో ఇరువురు నేతల భేటీ

– అయినా కొలిక్కిరాని పంచాయతీ

కడప, జనవరి24(జ‌నంసాక్షి) : జమ్మలమడుగు టీడీపీ నేతల మధ్య పంచాయతీ కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు ఎదుట మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తమ తమ వాదనలు వినిపిస్తున్నారు. జమ్మలమడుగు టీడీపీ నేతలైన ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి ఇద్దరూ కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డితో కలిసి అమరావతిలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇద్దరూ ఎమ్మెల్యే టికెట్‌కే పోటీ పడుతుండటంతో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్‌ పడితేనే జిల్లాలో మిగతా నియోజకవర్గాలకు సీట్ల ఖరారుపై స్పష్టత వస్తుందని నేతలు భావిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మలమడుగు టీడీపీ టికెట్‌ దక్కకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలంటూ రామసుబ్బారెడ్డిపై అనుచరులు ఒత్తిడి పెంచుతున్నారు. అటు మంత్రి ఆదినారాయణ రెడ్డిపై బంధువులు, సోదరులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. 2014 ఎన్నికల్లో గెలిచిన తమకే సీటు ఇవ్వాలంటూ ఆది వర్గం పట్టుబడుతోంది. రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి మరో నాలుగేళ్లు ఉందనేది ఆది వర్గం వాదనగా ఉంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే టికెట్‌ ఆదికే ఇవ్వాలని ఆయన వర్గం నేతలు, కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు. అవసరమైతే రామసుబ్బారెడ్డికి లోక్‌సభ టికెట్‌ ఇవ్వాలని ఆది వర్గం డిమాండ్‌ చేస్తోంది. దీంతో ఇరు వర్గాల మధ్య టికెట్‌ విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది.