టీడీపీ అవినీతిని..  పవన్‌ పక్కదారి పట్టిస్తున్నారు..!


– ఏపీ దోపిడీ దొంగలకు కేంద్రంగా మారింది
– టీడీపీ దొంగలను రక్షించేందుకు బాబు ఎవరితోనైనా కలుస్తారు
– పవన్‌ వెనకాముందు చూసుకొని మాట్లాడాలి
– ఇష్టమొచ్చినట్లు డైలాగ్‌లు పేలడానికి ఇది సినిమా కాదు
– వైసీపీ నేత బొత్స సత్యనారాయణ
కాకినాడ, నవంబర్‌29(జ‌నంసాక్షి) : తెలుగుదేశం పార్టీ అవినీతిని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పక్కదారి పట్టిస్తున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలోని బాలజీ చెరువు సెంటర్‌లో జరిగే ‘వంచనపై గర్జన’ దీక్ష ఏర్పాట్లను ఆపార్టీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌, ఫ్రూటీ కుమార్‌లు గురువారం పరిశీలించారు. అనంతరం బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశంలో మాట్లాడారు..  చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుది దృతరాష్టుడ్రి కౌగిలి అని, పవన్‌ కల్యాణ్‌ ఆలోచించుకోవాలని సూచించారు. ఓటుకు నోటు కేసుతో ఉమ్మడి రాజధానిని వదిలిన వ్యక్తి బాబు అని, టీడీపీ దొంగలను రక్షించేందుకు చంద్రబాబు ఎవరితోనైనా కలుస్తారని మండిపడ్డారు. ఏపీ దోపిడీ దొంగలకు కేంద్రంగా మారిందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు కావాలని చంద్రబాబు అడిగారని కేటీఆర్‌ చెప్పారని, టీఆర్‌ఎస్‌ పొత్తును తిరస్కరిస్తేనే కాంగ్రెస్‌తో బాబు జత కట్టారని, టీఆర్‌ఎస్‌తో పొత్తు ప్రతిపాదనపై చంద్రబాబు వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  చంద్రబాబు అవినీతిపై కాంగ్రెస్‌ పార్టీ ఛార్జ్‌ షీట్‌ విడుదల చేయలేదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబు నీతిపరుడు ఎలా అయ్యాడని మండిపడ్డారు. పవన్‌ మాట్లాడేటప్పుడు వెనుకాముందు చూసుకుని మాట్లాడాలని సూచించారు. ఇది సినిమా కాదని, రాజకీయాలు వేరు, సినిమా వేరన్న విషయం పవన్‌ కల్యాణ్‌ గ్రహించాలని హితవు పలికారు. జగన్‌పై పవన్‌ విమర్శలు అర్థంలేనివని కొట్టిపారేసిన బొత్స, చంద్రబాబు కనుసన్నల్లో జనసేన పార్టీ నడుస్తోందని ఆరోపించారు. జనసేనతో చంద్రబాబు చీకటి ఒప్పందాలు ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు వ్యాఖ్యలపై పవన్‌ కల్యాణ్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక ¬దా, విభజన చట్టంలోని హావిూలను సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని మండిపడ్డారు. ప్రజలను చంద్రబాబు ఏ విధంగా మోసం చేస్తున్నారో అందరు గమనిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాడానికి అన్ని సంఘాలు, విద్యార్థులు, యువత వంచనపై గర్జన దీక్షలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.