టీడీపీ తెలంగాణకు అనుకూలం : నగేష్
ఆదిలాబాద్, జనవరి 4 (): ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదని అఖిల పక్షం సమావేశంలో తమ పార్టీ స్పష్టం చేసిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, బోథ్ ఎమ్మెల్యే నగేష్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు తమ పార్టీ ఉద్యమిస్తుందని 2008లోగా కూడా తెలంగాణ ఏర్పాటు విషయమై ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని ప్రకటించినప్పటకీ టిఆర్‌ఎస్ నాయకులు తమ పార్టీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ లబ్ధికోసం తమ పార్టీని టార్గెట్ చేయడాన్ని ఆయన ఖండించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బడుగు, బలహీన సంక్షేమానికి కృషి చేయడంతో పాటు రైతుల రుణాలను మాఫీ చేస్తామన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీకి రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.