టీమిండియా స్వప్నం సాకరమే లక్ష్యంగా..

నిరంతరం కృషి
– నీలగిరి పుష్పాల్లా దేశం వికసిస్తోంది
– పార్లమెంట్‌ సమావేశాలు అత్యంత ఫలప్రదమయ్యాయి
– దేశ రక్షణలో త్రివిధ దళాలు ఆత్మార్పణ చేస్తున్నాయి
– త్యాగధనులందరికీ ప్రజల పక్షాన నమస్కరిస్తున్నా
– ఇంటింటికీ మరుగుదొడ్లు నిర్మించాలన్న స్వప్నాన్ని సాకారం చేశాం
– ప్రతి ఇంటికీ గ్యాస్‌ కనెక్షన్లు, ఆప్టికల్‌ ఫైబర్‌ లక్ష్యాలు నెరవేరుతున్నాయి
– స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ
– ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని
– ఎర్రకోట వేదికగా ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ప్రకటించిన మోదీ
– సెప్టెంబర్‌ 25న ప్రారంభమవుతున్నట్లు వెల్లడి
– తొలి విడతలో 10 కోట్ల మందికి వర్తింప జేస్తున్నట్లు తెలిపిన ప్రధాని
న్యూఢిల్లీ, ఆగస్టు15(జ‌నం సాక్షి) : 125కోట్ల భారతీయులను ఒక్కటి చేసేందుకు కృషి చేస్తున్నామని, టీమిండియా స్వప్నం సాకారమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నామని దేశ ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఎర్రకోటపై నిర్వహించిన 72వ స్వాతంత్య దినోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. స్వప్నాన్ని సాకారం చేసే దిశగా దేశం నిరంతరం పరిశ్రమిస్తోందని ప్రధాని అన్నారు. నవ చైతన్యం, నూతనోత్తేజంతో దేశం పురోగమిస్తోందని, 12 ఏళ్లకోసారి పుష్పించే నీలగిరి పుష్పాల మాదిరిగా దేశం వికసిస్తోంది ప్రధాని ఉద్ఘాటించారు. ఏపీ, తెలంగాణ, మిజోరాం, ఉత్తరాఖండ్‌ బాలికలు దేశ గౌరవాన్ని ఇనుమడింపజేశారని, ఎవరెస్టుపై మన బాలికలు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఆత్మవిశ్వాసాన్ని చాటారని ప్రధాని ప్రశంసించారు. పార్లమెంటు సమావేశాలు అత్యంత ఫలప్రదమయ్యాయన్న ప్రధాని, పేదలు, దళితులు, వెనుకబడి వర్గాల సమస్యలపై సుదీర్ఘ చర్చ సాగిందని తెలిపారు. సామాజిక న్యాయం దిశగానూ సమావేశాలు ఫలప్రదమయ్యాయని, దేశరక్షణలో త్రివిధ దళాలు ఆత్మార్పణ చేస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు. త్యాగధనులందరికీ దేశ ప్రజల పక్షాన ప్రణామం చేస్తున్నా అంటూ మోదీ పేర్కొన్నారు.
దేశంలో ఓపక్క వర్షాలు పడుతున్నాయన్న సంతోషం ఉన్నామని, మరోపక్క వరదలు అతలాకుతలం చేస్తున్నాయన్నారు. తమిళ కవి సుబ్రమణ్య భారతి స్వప్నించిన భారతాన్ని ఆవిష్కరించాల్సిన బాధ్యత మనపై ఉందని, పేద, మధ్య తరగతి ప్రజలు ముందడుగు వేసేందుకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు కృషి చేస్తున్నామన్నారు. గిరిజనులు, దళితులు దేశ ప్రగతిలో భాగస్వాములను చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. 125 కోట్ల భారతీయులను ఒక్కటి చేసేందుకు కృషి చేస్తున్నామన్న ప్రధాని,  టీమిండియా స్వప్నం సాకారమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ఇంటింటికీ మరుగుదొడ్లు నిర్మించాలన్న స్వప్నాన్ని సాకారం చేశామని, ప్రతి ఇంటికీ గ్యాస్‌ కనెక్షన్లు, ఆప్టికల్‌ ఫైబర్‌ లక్ష్యాలు నెరువేరుతున్నాయని అన్నారు.
ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ప్రకటించిన మోదీ..
దేశంలోని పేదలకు ఉచితంగా వైద్యసాయం అందించే లక్ష్యంతో చేపట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ –
జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. సెప్టెంబర్‌ 25న దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి నుంచి ఈ పథకం ప్రారంభమవుతుందని ప్రధాని వెల్లడించారు. ఈ పథకం ద్వారా దేశంలోని పేదలందరికీ ఉచిత వైద్య సాయం అందిస్తామన్నారు. తొలి విడతలో 10కోట్ల మందికి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నామని ప్రధాని పేర్కొన్నారు. రోగమొస్తే ఏం చేయాలన్న భయం పేదల్లో ఉండకూడదని మోదీ అన్నారు. ఇంట్లో ఒకరికి రోగమొస్తే కుటుంబమంతా దిక్కతోచని స్థితిలోకి వెళ్తుందని, అలాంటివారందరికీ ఈ పథకం భరోసా ఇస్తుందన్నారు. ఈ పథకం అమలు కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తామని ప్రధాని తెలిపారు. అవసరమైన వైద్య సిబ్బంది, సదుపాయాలు అందుబాటులో ఉంచుతామన్నారు. ఆరోగ్య భారత్‌ లక్ష్యంగా ఈ పథకం పనిచేస్తుందని మోదీ తెలిపారు. ప్రధాని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి ఏటా రూ.5 లక్షల మేరకు ఆరోగ్య బీమా వర్తిస్తుంది. దీనివల్ల 10 కోట్ల పేద కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. మొత్తం విూద 50 కోట్ల మందికి ఈ పథకం వర్తిస్తుందని భావిస్తున్నామన్నారు. ప్రభుత్వ నిధులతో నడిచే ఆరోగ్య బీమా పథకాల్లో ఇది ప్రపంచంలోనే అతిపెద్దదని కేంద్ర వర్గాలు చెబుతున్నాయని, సామాజిక, ఆర్థిక, కుల గణాంకాల డేటా ఆధారంగా లబ్ధిదారుల గుర్తింపు సాగుతోందని ప్రధాని తెలిపారు. ఇప్పటికే 80 శాతం మంది గుర్తింపు పూర్తయిందని, ఈ పథకం కింద 1354 చికిత్స పక్రియలను ఆరోగ్య శాఖ చేర్చిందన్నారు. గుండె బైపాస్‌, మోకీలు మార్పిడి తదితర శస్త్రచికిత్సలు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్‌) కన్నా 15-20 శాతం తక్కువ ధరకే అందుతాయని తెలిపారు. ఈ పథకంలో చేరిన ప్రతి ఆసుపత్రిలోనూ రోగులకు సాయం అందించడానికి ఒక ‘ఆయుష్మాన్‌ మిత్ర’ ఉంటారన్నారు. లబ్ధిదారుల అర్హతలను పరిశీలించడానికి ఒక ‘హెల్ప్‌ డెస్క్‌’ను కూడా వారు నిర్వహిస్తారని తెలిపారు. క్యూఆర్‌ కోడ్లు కలిగిన పత్రాలను లబ్ధిదారులకు అందిస్తామన్నారు. వీటిని స్కాన్‌ చేయడం ద్వారా లబ్ధిదారులను గుర్తించడం, పథకం కింద అందే ప్రయోజనాలకు వారికున్న అర్హతలను పరిశీలిస్తారని తెలిపారు. కనీసం పది పడకలున్న ఆసుపత్రి కూడా ఈ పథకంలో చేరొచ్చునని, అవసరమైతే ఈ నిబంధనను మరింత సడలించే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని ప్రధాని స్పష్టం చేశారు.