టీ20ల్లో ఏ జట్టునైనా భారత్ ఓడించగలదు: ధోని
మిర్పూర్:ట్వంటీ 20 ఫార్మాట్లో తమ జట్టు అత్యంత నిలకడగా ఉందని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్పష్టం చేశాడు. ప్రస్తుత భారత క్రికెట్ జట్టు ప్రపంచంలో ఎక్కడైనా ఏ జట్టుతోనైనా కచ్చితమైన పోటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నాడు. ప్రత్యేకంగా ట్వంటీ 20ల్లో టీమిండియా సమతుల్యంగా కనబడుతుందన్నాడు.
‘మా జట్టును చూడండి. ఇలా ఉండటం తరచుగా జరగొచ్చు. ఈ ఏడాది మేము ఆడిన 10 టీ 20ల్లో తొమ్మిది గెలిచాం. పలు దేశాల్లో వివిధ పరిస్థితుల్లో ఆడాం. నేను కేవలం చెబుతున్నది టీ 20 ఫార్మెట్ గురించి మాత్రమే, వన్డేల గురించి కాదు. మా జట్టులో ముగ్గురు యోగ్యమైన సీమర్లు ఉన్నారు. ఇద్దరు స్పిన్నర్లు, పార్ట్ టైమర్లు కూడా ఉన్నారు. ఎనిమిదో స్థానం వరకూ మా బ్యాటింగ్ పై భరోసా ఏర్పడింది. దాంతో మ్యాచ్ చివర్లో కొన్ని విలువైన పరుగులు కూడా జట్టుకు అదనంగా చేకూరుతాయి.ఇదే సరైన కాంబినేషన్ అనుకుంటున్నా’ అని యూఏఈతో మ్యాచ్ లో విజయం సాధించిన అనంతరం ధోని జట్టుపై విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ఆసియాకప్లో చివరి, ఫైనల్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో పోటీ కచ్చితంగా ఉంటుందన్నాడు. ఏ జట్టుకైనా స్వదేశీ పరిస్థితులు బాగా తెలియడం వల్ల బంగ్లాతో పోరు హోరాహోరీగా జరిగే అవకాశం ఉందన్నాడు.