టెక్స్టైల్ పార్కుకు భూములు ఇవ్వం..

 

– శాలివాహన సంక్షేమ సంఘం  జిల్లా అధ్యక్షులు రామరాజు

 

– వరంగల్లో విలేకరుల సమావేశం

 

వరంగల్ ఈస్ట్, నవంబర్ 12(జనం సాక్షి)

 

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాంపేట శివారులోని పేద కుమ్మరులకు సంబంధించిన భూమిని టెక్స్టైల్ పార్కు ఇవ్వమని శాలివాహన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు అన్నారం రామరాజు అన్నారు. ఈ మేరకు శనివారం వరంగల్ హంటర్ రోడ్ లోని సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ కొన్ని వందల ఏళ్లుగా భూమిని సాగు చేసుకుంటూ దానిమీదనే ఆధారపడుతున్న పేద  కుమ్మరులభూమిని టెక్స్టైల్ పార్క్ కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకునే పరిస్థితిలో భాగంగా అక్కడి పేద రైతులు తమ భూములు ఇవ్వమని నిరసన వ్యక్తం చేస్తున్నారని ఈ విషయంలో ప్రభుత్వం అధికారులు స్థానిక ఎమ్మెల్యే తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి పేదలకు ఉన్న ఆ కొంత భూమిని వారికే ఉండేలా చేయాలని కోరారు. గతంలో కూడా జిల్లా కలెక్టర్  రెవెన్యూ అధికారులతో పాటు ఇతర అధికారులకు రైతులు తమ సమస్యను విన్నవించామాని పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వం బలవంతంగా భూములు తీసుకోవాలని చూస్తే రైతులు ఆత్మహత్యలకు చేసుకోవడానికి కూడా సిద్ధపడనున్నట్లు హెచ్చరించారు. ఈ సమస్యపై ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సముద్రాల వెంకటేశ్వర్లు, సాంబయ్య, మౌనిక, సులోచన, సంజీవ, సంపత్, ఐలయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.