టోల్గేట్ సర్వే పనులను అడ్డుకున్న రైతులు
వలిగొండ టు కొత్తగూడెం జాతీయ రహదారి 930 పి సర్వేలో భాగంగా ఇల్లందు కొత్తగూడెం ప్రధాన రహదారి టేకులపల్లి మండల పరిధిలోని సులానగర్, రాజ్ తండాల మధ్య టోల్గేట్ నిర్మాణ పనుల కోసం భూ సేకరణలో భాగంగా సర్వేజండాలను పాతడానికి వచ్చిన సర్వే అధికారులను బాధిత రైతులు అడ్డుకున్నారు. దీంతో స్థానిక తహసిల్దార్ కృష్ణవేణి, పోలీసులతో అక్కడికి చేరుకున్నారు. ప్రజా ప్రయోజనాల కోసం నేషనల్ హైవే రహదారి సర్వే పూర్తయిందని, టోల్గేట్ నిర్మాణం కోసం సర్వే చేస్తున్న అధికారులకు అడ్డుపడుతున్న రైతులతో మాట్లాడారు. సర్వేలో భూ సేకరణ జరిగిన తర్వాత రైతులకు పరిహారం ఇవ్వడం జరుగుతుందని, ఎవరికి ఎలాంటి అన్యాయం జరగదని తెలిపారు. రైతులు మాట్లాడుతూ మాకు జీవనాధారమైన వ్యవసాయ భూమిని ఇవ్వమని, తమకు అదే ఆధారమని, మరోచోట టోల్గేట్ నిర్మాణానికి ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో కాసేపు తాసిల్దార్ కు, రైతులకు వాగ్వాదం జరిగింది. రైతులు సహకరించకుంటే సర్వే ప్రకారం మీకు వచ్చే పరిహారం కోర్టు ద్వారా అందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రాణాలైనా వదులుతాం కానీ మా పంట భూములను వదులుకోమని రైతులు తెగేసి చెప్పారు.