టోల్‌ప్లాజా వద్ద వీఐపీలు, జడ్జిలకు.. 

ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయండి
– ఎన్‌హెచ్‌ఏఐని ఆదేశించిన మద్రాస్‌ హైకోర్టు
– కోర్టు ఆదేశాలు పాటించకుంటే తగిన చర్యలు తప్పవని హెచ్చరిక
చెన్నై, ఆగస్టు30(జ‌నం సాక్షి) : దేశవ్యాప్తంగా ఉన్న టోల్‌ప్లాజాల వద్ద సిట్టింగ్‌ న్యాయమూర్తులు సహా వీఐపీలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలని మద్రాస్‌ హైకోర్టు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)ను గురువారం ఆదేశించింది. ఈ సదుపాయం తీసుకొచ్చేందుకు తగిన చర్యలు ప్రారంభించాలని తెలిపింది. ‘వీఐపీలు, సిట్టింగ్‌ జడ్జిల వాహనాలు టోల్‌ ప్లాజాల వద్ద ఆపడం బాధాకరమని, న్యాయమూర్తులు కూడా ప్లాజాల వద్ద దాదాపు పది నుంచి పదిహేను నిమిషాల పాటు వేచి ఉండాల్సి రావడం దురదృష్టకరం అని న్యాయస్థానం పేర్కొంది. న్యాయమూర్తులు జస్టిస్‌ హులువడి జి.రమేష్‌, జస్టిస్‌ ఎంవీ మురళిధరన్‌తో కూడిన ధర్మాసనం ఈమేరకు ఎన్‌హెచ్‌ఏఐను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని టోల్‌ప్లాజాలకు దీని గురించి తెలియజేస్తూ గమనిక పంపించాలని ఎన్‌హెచ్‌ఏఐకు తెలిపింది. వీఐపీలు, సిట్టింగ్‌ జడ్జిల వాహనాలు ఎలాంటి అడ్డంకులూ లేకుండా వెళ్లగలిగేలా ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలని తెలిపింది. టోల్‌ ప్లాజాలకు గమనిక పాటించకకపోయినా, కోర్టు ఆదేశాలను పాటించకపోయినా తగిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, షోకాజ్‌ నోటీసులు అందుకోవాల్సి వస్తుందని ఎన్‌హెచ్‌ఏఐను హెచ్చరించింది. టోల్‌ ప్లాజాలకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణను నాలుగు వారాల తర్వాతకు వాయిదా వేసింది.