ట్రంప్‌పై మరోసారి నిప్పులు చెరిగిన హిల్లరీ
డొనాల్డ్ ట్రంప్ పై డెమెక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ మరోసారి ఫైరయ్యారు. భిన్నాభిప్రాయాలను సహించలేని తత్వం కలిగిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవికి సరికాదని చెప్పారు. అధ్యక్ష అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత ఫిలడెల్ఫియాలో జరిగిన సభలో హిల్లరీ మాట్లాడారు. డొనాల్డ్ ట్రంప్ నే టార్గెట్ చేశారు. చంచలమైన మనస్తత్వం కలిగిన ట్రంప్ ను నమ్మి అమెరికా అణ్వాయుధాలను అప్పగించటం ప్రమాదకరమని చెప్పారు.
అమెరికా మరింత అభివృద్ధి సాధించాలంటే అది డెమోక్రాటిక్ పార్టీ ద్వారానే సాధ్యమన్నారు. అన్ని వర్గాలను కలుపుకుంటూ దేశాభివృద్ధికి పాటు పడతానని హిల్లరీ చెప్పారు. సైనిక శక్తి విషయంలో రాజీ పడకుండా ప్రపంచానికి నాయకత్వాన్ని అందిస్తానన్నారు. అధ్యక్ష పదవికి ఎన్నికైతే తన విజన్ ఎలా ఉంటుందో ఈ సమావేశంలో హిల్లరీ స్పష్టం చేశారు. అమెరికా పౌరులందరికీ ఉద్యోగాలిచ్చే ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తామన్నారు.
హిల్లరీ ప్రసంగం మొత్తంలోనూ ఎక్కడ రిపబ్లికన్ పార్టీని విమర్శించ లేదు. డొనాల్డ్ ట్రంప్ ను మాత్రమే ఆమె టార్గెట్ చేయటం విశేషం. హిల్లరీ ప్రసంగానికి జనం నుంచి ఫుల్ సపోర్ట్ లభించింది.