ట్రంప్ మాకు అధ్యక్షుడు కాడు..
ట్రంప్ మాకు అధ్యక్షుడు కాడు.. అంటూ అమెరికావ్యాప్తంగా డెమొక్రాట్లు ప్లకార్డులు పట్టి నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. ఇక.. హిల్లరీకి ఎక్కువ ఓట్లు పడ్డ కాలిఫోర్నియా రాష్ట్రంలో ట్రంప్ ఎన్నికతో మరోసారి వేర్పాటువాదం తెరపైకి వచ్చినట్టు ట్విటర్‌లో ఒక జోక్‌లాగా ప్రచారమవుతోంది. అది జోకే కావచ్చుగానీ.. నిజంగానే కాలిఫోర్నియాలో కొందరు తమ రాష్ట్రం అమెరికా నుంచి విడిపోవాలని కోరుకుంటున్నారు. ‘ఎస్ కాలిఫోర్నియా’ అనే బృందం ఇప్పటికే ఈ మేరకు శాక్రిమెంటోలో బుధవారంనాడు ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోవడాన్ని బ్రెక్జిట్ అన్నట్టుగానే.. తమ రాష్ట్రం విడిపోవడాన్ని ‘కాల్ ఎగ్జిట్’గా వారు వ్యవహరిస్తున్నారు. 2020 నాటికల్లా అమెరికా నుంచి కాలిఫోర్నియా విడిపోయి దేశంగా ఆవిర్భవించేలా చేయడమే వారి లక్ష్యం. ‘‘మాది ప్రపంచంలోనే ఆరో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. కాలిఫోర్నియా ఆర్థికంగా ఫ్రాన్స్ కంటే శక్తిమంతమైనది. పోలండ్ కంటే మా జనాభా ఎక్కువ. ఏ అంశంలో చూసినా కాలిఫోర్నియా దేశాలతో పోటీ పడుతుంది తప్ప.. అమెరికాలోని మిగతా 49 రాష్ట్రాలతో కాదు’’ అని ఈ బృందం తమ వెబ్‌సైట్‌లో పేర్కొనడం గమనార్హం. కాలిఫోర్నియా వేర్పాటుపై ఇప్పటికే తమకు పలువురి నుంచి ఆన్‌లైన్ ద్వారా, ఇతరత్రా పద్ధతుల్లో సందేశాలు వస్తున్నాయని వారు చెబుతున్నారు.