ట్రంప్ కి భయపడుతున్న మెక్సికన్లు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే ? ఆ ఆలోచన వస్తేనే మెక్సికన్లు వణికిపోతున్నారు. రిపబ్లికన్ అభ్యర్థి విజయం సాధిస్తే, తమకు భవిష్యత్తు ఉండదని మెక్సికో ప్రజలు భావిస్తున్నారు. ఆ దేశ జాతీయ మార్కెట్లు కూడా గజగజలాడుతున్నాయి. సాధారణంగా అమెరికాలో ఎన్నికలు జరిగితే, మెక్సికోలో సంబరాలు జరుగుతాయి. ఎందుకంటే ఆ రెండు దేశాల మధ్య ఆర్థిక, సామాజిక సంబంధాలు అలా ఉన్నాయి. కానీ అధ్యక్ష ప్రచారంలో మెక్సికోపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆ దేశ ప్రజలకు నిద్ర లేని రాత్రులు మిగిల్చాయి. అక్రమ వలసలను అడ్డుకునేందుకు సరిహద్దు వెంబట గోడ కట్టిస్తానని ట్రంప్ ప్రచారంలో వాగ్ధానం చేశారు. దాంతో మెక్సికన్లలో భయాందోళనలు మొదలయ్యాయి. అమెరికాతో సరిహద్దు ఉన్న మెక్సికో నుంచి అగ్రరాజ్యానికి వలసలు ఎక్కువగా ఉన్నాయి. అక్రమ వలసదారుల వల్లే అమెరికా తన ప్రాబల్యాన్ని కోల్పోతున్నట్లు ట్రంప్ అనేక సార్లు తన ప్రచారంలో పేర్కొన్నారు.