ట్రంప్ హాంఫట్..
` కుప్పకూలిన అమెరికా మార్కెట్లు
` స్టాక్ మార్కెట్లలో కొనసాగిన అమ్మకాల ఒత్తిడి
` కొవిడ్ తర్వాత ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి.
` భారత్‌లోనూ అదే పరిస్థితి
వాషింగ్టన్(జనంసాక్షి):
అమెరికా స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ట్రంప్ టారిఫ్‌ల ప్రకటన మూలంగా గత వారాంతంలో భారీ నష్టాల మూటగట్టుకున్న సూచీలు.. వరుసగా మూడో రోజూ అదే బాటలో పయనిస్తున్నాయి. మార్కెట్ ప్రారంభంలో ప్రధాన సూచీలైన ఎస్‌అండ్‌పీ 500.. 4.23 శాతం మేర కుంగింది. కొవిడ్ తర్వాత ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. డోజోన్స్ కూడా 1400 పాయింట్ల మేర పతనం కాగా.. నాస్‌డాక్ 4.55 శాతం క్షీణించి 700 పాయింట్ల మేర పడిపోయింది. ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాలపై టారిఫ్‌లు విధించడంతో అమెరికా సహా ప్రపంచ మార్కెట్లు భారీగా పతనం అవుతున్నాయి. నేడు భారత్ సహా దాదాపు అన్ని మార్కెట్లూ గట్టి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సుంకాలు, ప్రతి సుంకాల వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందని, మాంద్యం పరిస్థితులు తలెత్తాయని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నప్పటికీ.. ట్రంప్ మాత్రం తన చర్యలను సమర్థించుకుంటున్నారు. నాస్‌డాక్ శుక్రవారమే బేర్ మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యింది. రికార్డు గరిష్ఠాల నుంచి 22 శాతం మేర పతనం అయ్యింది. ఇప్పుడు ఎస్‌అండ్‌పీ 500 సూచీ కూడా నేడు బేర్ మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యింది.సాధారణంగా ఏదైనా సూచీ రికార్డు గరిష్ఠాల నుంచి 20 శాతం మేర పతనం అయితే దాన్ని బేర్ మార్కెట్‌లోకి వెళ్లినట్లు పరిగణిస్తారు. మరోవైపు అమెరికాలోని ప్రధాన స్టాక్స్ అన్నీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా 9 శాతం, చిప్‌ల తయారీ కంపెనీ ఎన్విడియా 7 శాతం, మెటా 4.5 శాతం, అమెజాన్ 4 శాతం, నెట్‌ఫ్లిక్స్ 3.4 శాతం, గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ 3 శాతం, యాపిల్ 6 శాతం చొప్పున నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
అమ్మకాల సునామీ..
` భారత్‌లోనూ ఆవిరైన కుబేరుల సంపద..
` 2,226 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
ముంబయి(జనంసాక్షి):వాణిజ్య యుద్ధ భయాలు మార్కెట్లను కుదిపేశాయి. ట్రంప్ సుంకాల మోత మోగిస్తే.. చైనా సైతం ‘ఢీ’ అంటూ టారిఫ్ సమరంలోకి దూకడంతో ఈ వాణిజ్య భయాలు మరింత తీవ్రమయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా వృద్ధిపై ఆందోళనలు, మాంద్యం పరిస్థితులు తలెత్తొచ్చన్న భయాలు ప్రపంచ మార్కెట్లలో సునామీలాంటి వాతావరణం నెలకొంది. మన మార్కెట్లూ ఆ సునామీలో కొట్టుకుపోయాయి. రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి ప్రధాన షేర్లు నష్టపోగా..ఆవిరైపోయింది. మెటల్ స్టాక్స్ తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఆరంభంలో ఓ దశలో 4 వేల పాయింట్ల నష్టాన్ని చవిచూసిన సెన్సెక్స్ కాస్త కోలుకుని 2,226 పాయింట్ల నష్టానికి పరిమితమైంది. నిఫ్టీ 742 పాయింట్ల నష్టంతో 22,150 ఎగువన ముగిసింది.అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో ఉదయం 71,449.94 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 75,364.69) దాదాపు 4వేల పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 71,425.01 వద్ద కనిష్ఠాన్ని తాకింది. రోజంతా నష్టాల్లోనే కదలాడిన సూచీ.. ఆఖర్లో కాస్త కోలుకుంది. చివరికి 2226.79 పాయింట్ల నష్టంతో 73,137.90 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 21,743.65 కనిష్ఠాన్ని తాకి చివరికి 742.85 పాయింట్ల నష్టంతో 22,161.60 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.85గా ఉంది.సెన్సెక్స్ 30 సూచీలో ఒక్క హిందుస్థాన్ యూనిలీవర్ మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టాల్లో ముగియడం గమనార్హం.టాటా స్టీల్ (7.73%), ఎల్‌అండ్‌టీ (5.78%), టాటా మోటార్స్ (5.54%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (4.33%), ఇన్ఫోసిస్ (3.75%) చొప్పున ప్రధానంగా నష్టపోయయాయి. ట్రంప్ దెబ్బకు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ కూడా భారీగా దిగొచ్చింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 63 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 3045 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ మిడ్ క్యాప్ షేర్లు 3.63 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 3.88 శాతం చొప్పున నష్టపోయాయి. బ్యాంక్ నిఫ్టీ సైతం 3.19 శాతం నష్టపోయి 49,860 వద్ద ముగిసింది.మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు రూ.14 లక్షల కోట్లు ఆవిరై రూ.389 లక్షల కోట్లకు చేరింది.మార్కెట్ అస్థిరతను సూచించే ఇండియా విక్స్ విలువ ఏకంగా 66 శాతం మేర పెరగడం గమనార్హం.
రంగాల వారీగా చూసుకుంటే.. మెటల్, రియాలిటీ స్టాక్స్ ప్రధానంగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోగా.. మిగిలిన రంగాల షేర్లూ నష్టాలు చవిచూశాయి.
మార్కెట్లలో ఎందుకింత ‘బ్లడ్‌బాత్’..? గత వారం వాల్‌స్ట్రీట్‌లో భారీ అమ్మకాలతో నేడు ప్రపంచ మార్కెట్లు కూడా భారీగా నష్టపోయాయి. జపాన్ నిక్కీ 8.49 శాతం, సింగపూర్ స్ట్రెయిట్ టైమ్స్ 8 శాతం, హాంగ్‌కాంగ్ హాంగ్‌సెంగ్ 15.24 శాతం, దక్షిణ కొరియా కోస్పీ 5.89 శాతం చొప్పున నష్టపోయాయి. మన మార్కెట్లు 3 శాతం మేర క్షీణించాయి. యూరప్ మార్కెట్లూ 5 శాతం మేర నష్టాలతో ప్రారంభమయ్యాయి.