ట్రాన్స్‌కో, డిస్కంలు పద్దతి మార్చుకోవాలి -కోదండరెడ్డి
హైదరాబాద్: రైతులకు విద్యుత్ సరఫరా విషయంలో ట్రాన్స్‌కో, డిస్కంలు పద్దతి మార్చుకోవాలని పీసీసీ కిసాన్ సెల్ చైర్మన్ కోదండరెడ్డి వ్యాఖ్యానించారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్నది ప్రభుత్వ నిర్ణయమని అయితే రైతులకు అనుకూల సమయంలో కాకుండా రాత్రిళ్లు విద్యుత్ సరఫరా చేయడం వల్ల ఇబ్బందికరంగా మారిందని ఆయన అన్నారు. సబ్‌స్టేషన్ల వారీగా విద్యుత్ సరఫరాలో రైతులను భాగస్వామ్యం చేయాలని సీఏం చెప్పినప్పటికీ అధికారులు స్పందించడం లేదని కోదండరెడ్డి వాపోయారు. సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో ఏడు జిల్లాలు సహా హైదరాబాద్ భాగస్వామిగా ఉందని హైదరాబాద్ అవసరాలు పెరిగిన దృష్ట్యా ఆయా జిల్లాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. శంకర్‌పల్లి పవర్ ప్రాజెక్టు దశాబ్దం గడిచినా పూర్తి కాలేదన్నారు. ట్రాన్స్‌కో, డిస్కం అధికారులు తీరు మార్చకపోతే కాంగ్రెస్ పార్టీ తరపున తామే నిరసనలకు దిగుతామని ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోదండరెడ్డి అన్నారు.