ట్వంటీ 20 వరల్డ్ కప్ ట్రోఫీ ఆవిష్కరణ

e1xrckv9ముంబై: వచ్చే ఏడాది భారత్ లో ట్వంటీ 20 వరల్డ్ కప్ జరుగనున్న నేపథ్యంలో ఆ ట్రోఫీని ముంబైలో శుక్రవారం ఆవిష్కరించారు. టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు, శిఖర్ ధవన్, అజింక్యా రహానేలు వరల్డ్ కప్ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.  టి20 ప్రపంచకప్ షెడ్యూల్ ను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రకటించిన అనంతరం ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.

తొలిసారి భారత్ వేదికగా జరిగే ట్వంటీ 20 వరల్డ్ కప్ మార్చి 11 నుంచి ఏప్రిల్ 3 వరకు నిర్వహించనున్నారు. ఢిల్లీ, ముంబైలలో సెమీఫైనల్స్ నిర్వహిస్తుండగా, కోల్ కతాలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.  న్యూజిలాండ్ తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడతుండగా, పాకిస్థాన్-టీమిండియాల మ్యాచ్ మార్చి 19వ తేదీన ధర్మశాలలో జరుగనుంది. భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టీమ్ లు ఒకే గ్రూపులో ఉండగా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, శ్రీలంక మరో గ్రూపులో ఉన్నాయి.

ట్వంటీ20 క్రేజ్ అమోఘం..

ప్రస్తుతం ట్వంటీ 20 క్రికెట్ అంటే విపరీతమైన క్రేజ్. 2005 లో తొలిసారి అంతర్జాతీయంగా ప్రవేశపెట్టిన ట్వంటీ 20 మ్యాచ్ లు అనతికాలంలోనే అమోఘమైన ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దీంతో ట్వంటీ 20 వరల్డ్ కప్ ను ప్రవేశపెట్టడానికి ఎంతో సమయం పట్టలేదు. 2007 లో తొలిసారి ట్వంటీ 20 వరల్డ్ కప్ ను ప్రవేశపెట్టారు.  దక్షిణాఫ్రికా వేదికగా  మొదటి ట్వంటీ 20 వరల్డ్ కప్ జరిగింది . 2007, సెప్టెంబర్ 11వ తేదీన ఆరంభమై 14 రోజుల పాటు జరిగిన ఆ టోర్నీలో…  మొత్తం 12 టీమ్ లు తలపడ్డాయి.  అయితే మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలోని  టీమిండియా  తొలిసారి ట్రోఫీని చేజిక్కించుకుంది.  దాయాది పాకిస్థాన్ తో జరిగిన ఫైనల్లో టీమిండియా కేవలం ఐదు పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్ ను గెలుచుకుంది.  2007, సెప్టెంబర్ 24 వ తేదీన ఇరు జట్లు మధ్య చివరివరకూ  దోబుచులాడిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ గెలిచి టైటిల్ ను కైవసం చేసుకుంది.

దీంతో ట్వంటీ 20 మ్యాచ్ లకు  భారత్ లో మరింత ఆదరణ లచించడమే కాకుండా,  ధోని నాయకత్వంపై కూడా సెలెక్టర్లకు విపరీతమైన నమ్మకం ఏర్పడింది.  అప్పట్నుంచి ఇప్పటివరకూ టీమిండియా జట్టులో ధోని కీలకంగా మారాడు. ఇప్పటివరకూ ఐదు ట్వంటీ 20 వరల్డ్ కప్ లు జరిగినా.. భారత్ లో ఇంకా ట్వంటీ 20 వరల్డ్ కప్ జరగలేదు. వచ్చే సంవత్సరం జరిగే ఆరో ట్వంటీ 20 వరల్డ్ కప్ కు తొలిసారి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.  అంతకుముందు దక్షిణాఫ్రికా(2007),ఇంగ్లండ్(2009), వెస్టిండీస్(2010), శ్రీలంక(2012), బంగ్లాదేశ్(2014) లలో ట్వంటీ 20 వరల్డ్ కప్ టోర్నీలు జరగగా..  వరుసగా భారత్ , పాకిస్థాన్, ఇంగ్లండ్, వెస్టిండీస్, శ్రీలంకలు మాత్రమే  కప్ ను చేజక్కించుకున్నాయి.