డబ్బుకొట్టు … ఉద్యోగం పట్టు
హైదరాబాద్, డిసెంబర్ 26 (జనంసాక్షి) :
ఏపీపీఎస్సీలో లంచాల వ్యవహారం బట్టబయలైంది. డబ్బులు గుంజి పోస్టులమ్ముకున్న గనుడి బాగోతాన్ని ఏసీబీ అధికారులు బయటపెట్టారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున డబ్బులు కూడబెట్టినట్లు గుర్తించారు. ఏపీపీఎస్సీ సభ్యుడు, అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి రిపుంజయరెడ్డి, వైఎస్ వ్యక్తిగత సహాయకుడు సూర్యనారాయణరెడ్డి అలియాస్ సూరీడు నివాసాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆకస్మిక దాడులు చేసింది. వీరిద్దరూ కలిసి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం రావడంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. బుధవారం ఉదయం 7 గంటల సమయంలో మొదలైన ఏసీబీ తనిఖీలు సాయంత్రం వరకు
సాగాయి. యూసుఫ్‌గూడలోని రిపుంజయరెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ తనిఖీలు కొనసాగాయి. కోట్ల కొద్దీ విలువైన ఆస్తులను అధికారులు గుర్తించారు. కొన్ని బ్యాంకు పత్రాలతో పాటు మరికొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. రూ. నాలుగు కోట్లు అక్రమంగా కూడబెట్టినట్లు గుర్తించారు. సూరీడు నివాసంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ గాయత్రినగర్‌లోని సూరీడు ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఏపీపీఎస్సీ సభ్యుడు రిపుంజయ్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారనే నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఇద్దరు కలిసి అనేక వ్యాపారాలు చేస్తున్నారని, భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు తెలిసింది. రిపుంజయ్‌రెడ్డి, సూరీడులు కలిసి ఆస్తులు కూడబెట్టారని సమాచారముందని ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్ తెలిపారు. రిపుంజయరెడ్డికి, సూరీకి మధ్య ఉన్న సంబంధాలు, అతనికి బినావిూగా వ్యవహరించాడా? అనే అంశాలపై విచారిస్తున్నట్లు మరో డీఎస్పీ నర్సింహారెడ్డి తెలిపారు. ఈ వ్యవహారంలో మొత్తం 8 బృందాలు రిపుంజయరెడ్డి బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లపై హైదరాబాద్‌తో పాటు కడపలో కూడా దాడులు చేస్తున్నట్లు చెప్పారు. సూరీడు నివాసంలో ఆస్తులకు సంబంధించిన కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్ బోర్డు, ఏపీపీఎస్సీ సభ్యుడిగా అవినీతికి పాల్పడ్డారని రిపుంజయ్‌రెడ్డిపై అనేక ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన నివాసంపై దాడులు జరిగాయి. నాలుగు బృందాలుగా విడిపోయిన ఏసీబీ అధికారులు.. రాష్ట్ర వ్యాప్తంగా ఏడుచోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. యూసుఫ్‌గూడ వెంకటగిరిలోని రిపుంజయరెడ్డి నివాసంలో నిర్వహించిన తనిఖీల్లో కోట్ల విలువైన ఆస్తులు, నగలు, నగదు లభ్యమైంది. ఒక్క వెంకటగిరిలోనే ఆయనకు ఆరు ఫ్లాట్లు ఉన్నట్లు తనిఖీల్లో బయటపడింది. అలాగే, అయ్యప్ప సొసైటీలో ప్లాట్, కడపలో 30 ఎకరాల భూమితో పాటు భారీగా బంగారం లభించినట్లు సమాచారం. రిపుంజయరెడ్డకి, సూరీడికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు సూరీడు ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. రాత్రి సమయంలో రిపుంజయరెడ్డిని అరెస్టు చేసినట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.