డీజిల్, పెట్రోలు కల్తీ అమ్మకాలపై వాహనదారుల ఆందోళన
కరీంనగర్, జనవరి 19 : సుల్తానాబాదు పట్టణంలోని పెట్రోలు బంకుల్లో డీజిల్, పెట్రోలు కల్తీ చేసి విక్రయిస్తున్నారని వాహనదారులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రాజీవ్ రహదారిపై శనివారం కోనుగోలు దారులు ధర్నా నిర్వహించారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పెట్రోలు, డీజిల్‌లో కల్తీ చేస్తూ బంకు యజమానులు అధిక లాభాలు గడిస్తున్నారని వాహనదారులు విమర్శించారు. డీజిల్‌ను వాహనాల్లో వాడుతున్నందున పాడైపోతున్నాయని వాటిని మరమ్మత్తులు చేయించుకునేందుకు అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని పేదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. అధికారులు పెట్రోలు బంకుల్లోని పెట్రోలు, డీజిల్‌ను రసాయనిక పరీక్షలకు పంపి నిజనిర్థారణ జరిపించాలని కోరారు. నిజ నిర్థారణలో కల్తీ జరిగిందని తెలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, ఎవ్వరిని ఉపేక్షించవద్దని వారు డిమాండ్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి వాహనదారులకు సద్ది చెప్పి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా నిర్వహించారు.