డెంగీతో ఇద్దరు మృతి
ఉమ్మడి జిల్లాలో నమోదువుతున్న కరోనా
ఖమ్మం,జూలై19(జనంసాక్షి): రాష్ట్రంలో డెంగీతో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లికి చెందిన లాకావత్ సైదులు(38)వారం రోజులుగా కొత్తగూడెంలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థతి విషమించడంతో సోమవారం హైదరాబాద్ తరలిస్తుండగా మృతి చెందాడు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శభాష్‌పల్లికి చెందిన శరత్‌కుమార్(21)హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో 840మందికి పరీక్షలు నిర్వహించగా 15 పాజిటివ్ కేసులు నమోదైనట్లు డీఎంహెచవో డాక్టర్ మాలతి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 464మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ నమోదైంది. వర్షాలు పడుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూసే బాధ్యత శానిటరీ ఇన్స్‌పెక్టర్లు, జవాన్లదేనని మేయర్ పునుకొల్లు నీరజ పేర్కొన్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై శానిటరీ ఇన్స్‌పెక్టర్లు, జవాన్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్ మాట్లాడుతూ నగరంలో ప్రతీమంగళవారం, శుక్రవారం నిర్వహించే డ్రైడే కార్యక్రమాల్లో పారిశుధ్య విభాగం తప్పనిసరిగా భాగస్వామ్యం కావాలని, తద్వారా డెంగ్యూవ్యాధి ప్రబలకుండా చూడాలన్నారు. ఈ సీజన్‌లో డెంగ్యూవ్యాధి రాకుండా చూసే బాధ్యత పారిశుధ్య విభాగానిదేనని మేయర్ స్పష్టం చేశారు. పారిశుధ్య కార్మికులపై జవాన్ల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని, అలాగే కార్మికులు రక్షణ దుస్తులు ధరించి, పారిశుధ్య పనుల్లో పాల్గొనాలని మేయర్ కోరారు. ప్రతి డివిజన్‌లో సాయంత్రం ఫాగింగ్ చేయాలని, ఈ విషయమై తాను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తానన్నారు. కార్మికులు తమకు సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తేవాలని మేయర్ నీరజ కోరారు.