డెమొక్రాట్లకు ట్రంప్ భయం… పోటీ నుంచి తప్పుకోవాలంటూ శాండర్స్‌పై ఒత్తిడి
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న పరిణామాలు ఆసక్తికరంగా ఉన్నాయి. రిపబ్లికన్ పార్టీలో ఘర్షణ వాతావరణం సద్దుమణుగుతుండగా, ఆ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్‌ను చూసి డెమొక్రాట్లు భయపడిపోతున్నారు. త్వరగా హిల్లరీ క్లింటన్‌కు నామినేషన్ ఇచ్చే పరిస్థితులు వచ్చేస్తే ట్రంప్‌పై గురిపెట్టి ప్రచారం చేయవచ్చునని ఆమె వర్గీయులు అంటున్నారు. డెమొక్రాటిక్ బరి నుంచి బెర్నీ శాండర్స్ తప్పుకోవాలని ఆ పార్టీ పెద్దలు డిమాండ్ చేస్తున్నారు. అయితే శాండర్స్ వర్గీయులు అందుకు ససేమిరా అంగీకరించబోమని చెప్తున్నారు. అభిప్రాయ సేకరణ ఫలితాలను బట్టి చూసినపుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించాలంటే హిల్లరీ కన్నా శాండర్స్ ఉత్తముడని ఢంకా బజాయిస్తున్నారు.
బెర్నీ శాండర్స్ ఇంకా ఎక్కువ కాలం ఎన్నికల బరిలో ఉండటం వల్ల హిల్లరీ విజయావకాశాలు దెబ్బతింటాయని డెమొక్రాటిక్ చట్ట సభ సభ్యులు భయపడుతున్నారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ రిపబ్లికన్ పార్టీలో డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థులంతా ఆయనకు మార్గం సుగమం చేయడాన్ని ప్రస్తావిస్తున్నారు. పోల్స్‌లో శాండర్స్ కన్నా హిల్లరీకి 30 లక్షల ఓట్ల ఆధిక్యం కనిపిస్తోందని చెబుతున్నారు. అయితే శాండర్స్ వర్గీయుల వాదన మరోలా ఉంది. తాజా సర్వేల్లో ట్రంప్‌తో పోటీకి బెర్నీ శాండర్సే అత్యుత్తముడని వెల్లడవుతోందని అంటున్నారు. చిట్ట చివరిగా జూన్ 7న జరిగే కాలిఫోర్నియా ప్రైమరీ వరకు పోటీ నుంచి తప్పుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు.