డోన్ పట్టణంలో భారీ చోరీ
ఇంట్లో ఎవరూ లేనిది చూసి నగలు,నగదు దోపిడీ
దర్యాప్తు చేపట్టిన పోలీసులు
కర్నూలు,ఆగస్ట్1(జనం సాక్షి): కర్నూలు జిల్లా డోన్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలోని ¬ం టౌన్ కాలనీలో పాపిరెడ్డి ఇంట్లో బుధవారం రాత్రి భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేరని ముందే పసిగట్టిన దొంగలు ఇంట్లో ఉన్న నగుల, నగదు దోచుకున్నారు. పాపిరెడ్డి భార్య లక్ష్మిదేవికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మంగళవారం చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని బుధవారం రాత్రి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చే సరికి తాళాలు పగలు గొట్టి ఉండటం చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించారు. దొంగలు ఆధారాలు దొరక్కుండా సీసీ కెమోరాలను ధ్వంసం చేసి హార్డ్ డిస్క్ ఎత్తుకెళ్లారు. పాపిరెడ్డి బ్యాంకు లాకరులో ఉన్న బంగారాన్ని మూడు రోజుల క్రితం తీసుకొచ్చి ఇంట్లో పెట్టి భార్య చికిత్స కోసం హడావుడిగా హైదారాబాద్ వెళ్లారు. ఇంట్లో ఉన్న 30 తులాల బంగారు, మూడు లక్షల రూపాయల నగదును దొంగలు చోరీ చేసినట్లు బాధితులు చెబుతున్నారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. ఈ చోరీపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వరుసగా జరగుతున్న దొంగతనాలతో పట్టణ వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు.