డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకుని జీవితాలను ఆగం చేసుకోవద్దు: టూ టౌన్ సిఐ చంద్ర శేఖర్ రెడ్డి

విద్యార్థులతో అన్ లైన్ ద్వారా ఈ – ప్లేడ్జ్ చేయించిన టూ టౌన్ ఎస్.ఐ.
– – తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేయకుండా కెరీర్ పై దృష్టి పెట్టాలని సూచన
– – దేశ నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకం

నల్లగొండ : మాదకద్రవ్యాల ఉచ్చులో యువత చిక్కుకోవద్దని, దేశ నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకమైనదని నల్లగొండ టూ టౌన్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్.ఐ. ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు.

మంగళవారం నల్లగొండ పట్టబంలోని ఎన్.జి. కళాశాల విద్యార్థులకు టూ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన యాంటీ డ్రగ్స్ – నార్కోటిక్స్ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన విద్యార్థులతో మొబైల్ ఫోన్ ద్వారా ఆన్ లైన్ పద్ధతిలో ఈ ప్రతిజ్ఞ చేయించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలన్నారు. తల్లితండ్రుల కలలు, ఆశలను సాధించే దిశగా కెరీర్ పై దృష్టి సారించి చదువుకోవాలని సూచించారు. గంజాయి, గుట్కా, సిగరెట్, డ్రగ్స్ లాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాటికి బానిసలుగా మారవద్దని కోరారు కళాశాలలో ఎవరైనా మత్తు పదార్ధాలు విక్రయించినా, వాటికి అలవాటు పడిన వారు ఉన్నా పోలీసులకు సమాచారం అందించాలని చెప్పారు. దేశ నిర్మాణంలో యువత పాత్ర చాలా కీలకమైనదని, అలాంటి యువత మత్తు పదార్ధాలకు బానిసలుగా మారి ఆగం కావద్దన్నారు. మత్తు యువతను చిత్తు చేస్తుందని, మాదకద్రవ్యాల వినియోగం ద్వారా జరిగే నష్టాలు, సర్వం కోల్పోతున్న కుటుంబాలు, ఉజ్వల భవిష్యత్తు కోల్పోయిన ఎంతో మంది యువత జీవితాలను తెలియజేయదం ద్వారా వారిలో అవగాహన కల్పించడం లక్ష్యంగా పోలీస్ శాఖ చేస్తున్న కృషికి అధ్యాపకులు సహకరించి విద్యార్థులను సన్మార్గంలో నడిపించేలా కృషి చేయాలని కోరారు. ఆన్ లైన్ ద్వారా ప్రతిజ్ఞ చేసే ప్రతి విద్యార్ధికి దృవపత్రం పేరుతో వస్తుందని, దానిని డౌన్ లోడ్ చేసుకుని ఆ ప్రతిజ్ఞకు అనుగుణంగా మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.

కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మునీర్, అధ్యాపకులు దుర్గాప్రసాద్, రుకేస్, మల్లేష్, ASI జయ రాం, పిసి లు బాలకోటి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.