డ్రెయిన్ల ఆధునీకరణకు మోక్షమెప్పుడో?
పూడు చేరడంతో రైతుల్లో ఆందోళన
ఏలూరు,ఆగస్ట్6(జనం సాక్షి): అనేక గ్రామాల్లో డ్రెయిన్‌లో పలుచోట్ల గుర్రపుడెక్క విపరీతంగా పెరిగిపోయింది. పెనుమంచిలి, ఆచంట, వల్లూరు వంతెన వద్ద ఇదే రీతిలో ఎగువ నుంచి వచ్చిన చెత్తా చెదారం భారీగా రాడడంతో నీరు కిందకు వెళ్లే మార్గం లేక పంట పొలాలను ముంచెత్తుతోంది. ప్రస్తుతం ఇదే పరిస్థితి తలెత్తడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆచంట నియోజకవర్గంలోని ఆచంట, పోడూరు, పెనుగొండ మండలాల పరిధిలో నక్కల డ్రెయిన్ విస్తరించి ఉండడంతో వర్షాకాలం వచ్చిందంటే రైతులకు కంటివిూద కునుకు ఉండడం లేదు. నాలుగేళ్ల క్రితం ఈ డ్రెయిన్ ఆధునికీకరించిన అనతికాలంలోనే ఆక్రమణలు, పూడుకతో పరిస్థితి మరలా మొదటికి వచ్చింది. ఈ నేపథ్యంలో కొద్దిపాటి వర్షం వచ్చిందంటే సవిూపంలోని పంట పొలాలు ముంపుబారిన పడడం ఆనవాయితీగా మారింది. ఈ ఒక్క డ్రెయిన్ పరిధిలో మూడు మండలాల్లో సుమారు 25 వేల ఎకరాల పంట భూములు ముంపుబారిన పడే ప్రమాదం ఉంది. కొఠాలపర్రు, తాడేరు, వల్లూరు డ్రెయిన్ పరిధిలో మరో 10 వేల ఎకరాలకు ప్రమాదం పొంచి ఉంది. వచ్చే రెండు నెలల్లో వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉండడంతో రైతుల్లో ఆందోళన మరింత పెరిగింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రెయిన్‌లో గుర్రపుడెక్క తొలగించాలని మండల రైతులు కోరుతున్నారు. ఇకపోతే సార్వా వరినాట్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. డెల్టా పంట కాలువలకు జూన్ ఒకటో తేదీ నుంచి నీరు విడుదలైనా 20 రోజుల వరకూ పలు శివారు భూములకు నీరు చేరలేదు. మరోపక్క ముందస్తు ఖరీఫ్‌కు సిద్ధం కావాలంటూ అధికారులు ఒత్తిడి తీసుకురావడంతో నీరు లేకుండా నారుమడులు ఏ విధంగా వేయాలంటూ రైతులు నిలదీశారు. ఆచంట, వేమవరం, వల్లూరు, పెనుమంచిలి పరిసరాల శివారు భూములకు పంట కాలువ గుర్రపుడెక్కతో పూడుకుపోవడంతో నీరు ఆలస్యంగా అందింది.
——