ఢిల్లీలో బిజీబిజీగా కుమారస్వామి

– రాహుల్‌తో ఆయన నివాసంలో భేటీ
– వందరోజుల పాలన పూర్తయినందున మర్యాదపూర్వకంగా కలిశానన్న సీఎం
న్యూఢిల్లీ, ఆగస్టు30(జ‌నం సాక్షి) : కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి గురువారం  న్యూఢిల్లీలో బిజీగా గడిపారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఆయన నివాసంలో ఉదయం కలుసుకున్నారు. కర్ణాటకలో జేడీఎస్‌-కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉండగా, కూటమి సర్కార్‌కు ముఖ్యమంత్రిగా కుమారస్వామి పగ్గాలు చేపట్టి నేటితో వందరోజులు పూర్తయింది. ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా ఆయన రాహుల్‌ను కలిశారు. పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విూడియాతో మాట్లాడిన కుమారస్వామి, తాను సీఎంగా వంద రోజుల పాలన పూర్తి చేసుకున్నందున  మర్యాదపూర్వకంగా రాహుల్‌ను కలిసినట్టు చెప్పారు. కర్ణాటక ప్రభుత్వ పనితీరుపై రాహుల్‌ సైతం చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు. సిద్ధరామయ్యపై ఫిర్యాదు చేశారా అని విూడియా ప్రశ్నించగా… అలాంటిదేవిూ లేదని కొట్టిపారేశారు. సుహృద్భావ పూర్వకంగానే తానిక్కడకు వచ్చానని అన్నారు. కాగా, హస్తిన పర్యటనలో భాగంగా పీఎంఓ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ను కూడా కుమారస్వామి కలిశారు. కర్ణాటకలోని కొడగు జిల్లాలో సంభవించిన భారీ వరదలు, నష్టాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఇదిలా ఉంటే రాహుల్‌గాంధీతో భేటీలో కర్ణాటకలోని పలువురు కాంగ్రెస్‌ నేతలపై కుమారస్వామి రాహుల్‌కు పిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల సిద్ధరామయ్యతో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు పాలనాపరంగా కొంత ఇబ్బందికి గురిచేసేవిధంగా ప్రవర్తిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఐక్యతను కొనసాగించుకుంటూ ముందుకెళ్లాలంటే వారిని కట్టడి చేయాలని రాహుల్‌ గాంధీకి కుమారస్వామి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.