ఢిల్లీ వేదికగా 24 నుంచి ఇండియా ఓపెన్ సిరీస్
హైదరాబాద్, మార్చి 22 : ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో టైటిల్‌ను సాధించాలని ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ ఉవ్విళ్లూరుతోంది. ఢిల్లీ వేదికగా ఈ నెల 24 నుంచి 29 వరకు ఈ బ్యాడ్మింటన్ సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్‌లో సైనాతోపాటు ఇతర షట్లర్లు కశ్యప్, శ్రీకాంత్, సాయి ప్రణీత్, సిక్కిరెడ్డి, గుత్తా జ్వాల, రుత్విక శివాని, రితుపర్ణాదాస్ పాల్గొంటున్నారు. ్డఇటీవల ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో కరోలినా మారిన్ చేతిలో ఒలింపిక్ కాంస్య విజేత సైనా నెహ్వాల్ పరాజయంపాలై రన్నరప్‌గా నిలిచింది.
దీనికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం సైనాకు ఇండియా ఓపెన్ సిరీస్‌లో కలుగనుంది. 2010లో చైనాయేతర క్రీడాకారుడు టినే బౌన్ (డెనార్క్) ప్రపంచ నెంబర్ వన్‌గా నిలిచాడు. సైనా, మారిన్‌లో ఎవరు నెంబర్ వన్‌గా నిలిచినా.. భారత్, స్పెయిన్‌లకు చెందిన మహిళలు ఆ ఘనతను సాధించడం తొలిసారే కానున్నది. ఈ ఏడాది సైనా, మారిన్‌లు రెండుసార్లు ముఖాముఖి తలపడ్డారు. ఈ ఏడాది జనవరిలో సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రీ గోల్డ్‌లో మారిన్‌ను సైనా చిత్తు చేస్తే, ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో సైనాపై మారిన్ ప్రతీకారం తీర్చుకుంది. ఈ టోర్నీలో సైనా, మారిన్‌లకు ప్రపంచ నెంబర్ వన్ అవకాశాలు ఉండటంతో ఈ టోర్నీ మరింత ఆసక్తిగా మారింది. గత ఏడాది కాలంలో 10 ఉత్తమ ప్రదర్శనల ఆధారంగా క్రీడాకారులకు ర్యాంకింగ్ లభిస్తుంది. సైనా ప్రస్తుతం 78,381 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, చైనా లీ జురుయ్ 79,214 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. లీ జురుయ్ ఈసారి ఇండియా ఓపెన్‌లో పాల్గొనని కారణంగా 7,800 పాయింట్లు కోల్పోయి, 71,414 పాయంట్లకు చేరింది. గత 52 వారాల్లో సైనా 13 టోర్నీలు ఆడగా, లీ జురుయ్ 9 ఆడింది. సైనా ఈ పోటీ నుంచి తప్పుకున్నా కూడా 74,381 పాయంట్లతో జురుయ్ ముందుంటుంది.
హైదరాబాదీ షట్లర్ సైనాకు ప్రపంచ చాంపియన్ కరోలిన్ మారిన్ నుంచి పెను సవాల్ ఉంది. సైనా ఇండియా ఓపెన్ క్వారర్స్ లేదా ఆ లోగానే ఓడి.. 72,098 పాయింట్లతో ఉన్న కరోలినా ఫైనల్ చేరితే ప్రంపంచ నెంబర్ వన్‌గా నిలుస్తుంది. వీరిద్దరూ ఫైనల్ చేరితే నెంబర్ వన్ సైనా సొంతమవుతుంది. 2010లో ఈ టోర్నీ సింగిల్స్ టైటిల్‌ను సైనా చేజిక్కించుకుంది. 2011 నుంచి ప్రపంచ సూపర్ సిరీస్ సర్య్కూట్‌లో జరుగుతున్న ఇండియా ఓపెన్‌లో టైటిల్‌ను సైనా దక్కించుకోలేదు. ఈ ఏడాది టోర్నీలో సైనా తొలి రౌండ్‌లో క్వాలిఫయర్‌తో తలపడనుంది. తరువాత రౌండ్‌లో రుత్విక శివానీతో సైనా పోరాడే అవకాశం ఉంది. క్వార్టర్స్ పైనల్లో తైపీ క్రీడాకారిణి పాయ్ యు, సెమీఫైనల్లో చైనా క్రీడాకారిణి లియు జిన్‌తో సైనా ఢీకొనే అవకాశాలున్నాయి. మొత్తం మీద సైనా ఈ టోర్నీ ఫైనల్‌కు చేరితే ఎలాంటి గణాంకాలతో నిమిత్తం లేకుండా ఆమె నెంబర్ వన్‌గా నిలుస్తుంది.
ఈ టోర్నీ పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లో కిడాంబి శ్రీకాంత్ తనోంగ్ చక్ (థాయ్‌లాండ్)తో తలపడనున్నాడు. అదేవిధంగా సాయి ప్రణీత్.. విక్టర్ ఆక్సెసన్ (డెన్మార్క్) మధ్య, పారుపల్లి కశ్యప్.. సుజెన్ హో (తైపీ)తో పోరాడనున్నారు. మహిళల సింగిల్స్ మొదటి రౌండ్‌లో కరోలిన్ మారిన్‌పై రితుపర్ణా దాస్ తలపడనుంది. ఇక మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో జ్వాల-పొన్నప్ప జోడీ దోంగిని-క్సియాన్‌హన్ (చైనా) ద్వయాన్ని ఓడించాల్సి ఉంటుంది. సిక్కిరెడ్డి-ప్రద్యగాద్రె జంట.. జెంగ్-యోవన్ (కొరియా) జోడీని చిత్తు చేయాల్సి ఉంటుంది.