తండ్రి ప్రవర్తనకు విసుగు చెంది, ఇనుప పైపుతో కొట్టి చంపిన కుమారులు……
జనం సాక్షి దుబ్బాక.
తోలుత తండ్రిని నెట్టి వేయడంతో కింద పడి మృతి చెందినట్లు కుమారుల చిత్రీకరణ …
పరాయి మహిళతో తండ్రి కొనసాగిస్తున్న వివాహేతర సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కుమారులు తండ్రితో ఘర్షణపడి, తలపై ఇనుప పైపుతో బలంగా కొట్టి చంపిన ఘటనలో మృతుని భార్యతో పాటు ముగ్గురు కుమారుల మీద కేసు నమోదు చేసిన దుబ్బాక పోలీసులు సోమవారం రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా దుబ్బాక సీఐ మున్నూరు కృష్ణ విలేకరులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన చింతల తిరుపతి (50) గత నెల ఆగస్టు 29న కొడుకులతో జరిగిన ఘర్షణలో నెట్టి వేయబడడంతో తలకు సిమెంటు దిమ్మె తగిలి చనిపోయాడని ఫిర్యాదు ఆధారంగా తోలుత కేసు నమోదు చేశారు. అనంతరం మృతుని శవపరీక్షలో తలపైన బలమైన ఆయుధంతో కొట్టినట్లు గాయం ఉండడంతో పోలీసులు తమదైన శైలిలో మృతుని భార్యతోపాటు ఆమె ముగ్గురు కుమారులను విచారించారు. విచారణలో తండ్రి వివాహేతర సంబంధం నేపథ్యంలో తమ కుటుంబంలో కొంతకాలంగా తీవ్రంగా గొడవలు జరుగుతున్నాయని, పరాయి మహిళతో వివాహేతర సంబంధం వద్దని ఎంతగా వారించిన తండ్రి వినలేదని వారు తెలిపారు. ఈ క్రమంలో గత నెల ఆగస్టు 29న తండ్రి, వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ దేవమ్మతో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, సిద్దిపేట శివారులోని రామచంద్ర నగర్ వద్ద చూసిన కుమారుడు అడ్డుకునే ప్రయత్నం చేయగా, తండ్రి ద్విచక్ర వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయాడు. దానితో రగిలిపోయిన భార్య, కుమారులు, రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన తండ్రి తిరుపతితో తీవ్రంగా ఘర్షణ పడ్డారు. దీనితో తండ్రి ప్రవర్తనకు తీవ్రంగా విసుగు చెందిన మూడవ కుమారుడు గణేష్ ఇంట్లో ఉన్న ఇనుప పైపుతో తండ్రి తలపై వెనక బలంగా కొట్టడంతో, తండ్రి అక్కడికక్కడే కుప్పకూలాడు. అనంతరం భార్య, ముగ్గురు కుమారులు, తలకు తీవ్ర గాయమైన తిరుపతిని ఆటోలో సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే తిరుపతి మృతి చెందాడని తెలిపారు. మృతుని భార్య ఐలవ్వ, ముగ్గురు కుమారులు భాస్కర్, గణేష్, శివాజీ మీద హత్య కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు సీఐ తెలిపారు.