తక్షణమే వైద్యులను నియమించాలి
సున్నిపెంటలో డాక్టర్ల కొరతపై ఆందోళన
కర్నూలు,ఆగస్ట్4(జనం సాక్షి): సున్నిపెంటలోని ప్రభుత్వ వైద్యశాలకు తక్షణమే వైద్యులను నియమించాలని భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా కార్యదర్శి ఆశీర్వాదం ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్ మల్లిఖార్జున్‌రావుకు వినతి పత్రాన్ని శనివారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 38 వేల మంది నివాసం ఉంటున్న ఈ ప్రాంతంలో స్థానికులతో పాటు, బయట నుంచి వచ్చే యాత్రికులు కూడా ఈ వైద్యశాలలోనే వైద్యం చేయించుకుంటారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 8 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, కేవలం ముగ్గురు మాత్రమే ఉండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. శ్రీశైల మల్లిఖార్జున దేవాలయానికి యాత్రికులు వచ్చే ఘాట్‌రోడ్డులో ప్రమాదాలు చోటు చేసుకుంటున్న క్రమంలో క్షతగాత్రులను సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికే తీసుకుని వస్తారని అన్నారు. గర్భిణులకు కాన్పులు చేసేందుకు మహిళ గైనకాలజిస్ట్ లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వైద్యశాలలో రక్త నిధి కేంద్రం మూసివేయడం వలన సీరియస్ కేసులను బయటకు పంపించడం జరుగుతోందన్నారు. ఎటు పోవాలన్న 200 కి.విూ వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు అధికారులు స్పందించి తక్షణమే సున్నిపెంటలోని ప్రభుత్వ వైద్యశాలకు వైద్యులను నియమించాలని వారు డిమాండ్ చేశారు.