తగ్గిన గోదారినీటి మట్టం

ఏలూరు,డిసెంబర్‌7(జ‌నంసాక్షి): పోలవరం వద్ద గోదావరి నీటి మట్టం గణనీయంగా తగ్గింది. దీంతో ఇసుక తిన్నెలు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం  స్వల్పంగా ఉండడంతో  రానున్న రోజుల్లో ఈ నీటిమట్టం మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఇప్పటివరకు ఏకథాటిగా గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు సరఫరా చేశారు. దీనిని తాజాగా నిలిపివేశారు. రోజుకు సుమారు 8500 క్యూసెక్కుల గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు సరఫరా చేశారు. దీంతోపాటు పోలవరం నుండి కొవ్వూరు మధ్యలో గల చిన్నచిన్న ఎత్తిపోతల పథకాల నుండి పశ్చిమ డెల్టాకు నీటిని విడుదల చేయడంతో గోదావరి నీటిమట్టం పూర్తిగా తగ్గిపోయింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పరిమితికి మించి నీటిని తోడడం వల్లే ఇసుక తిన్నెలు బయట పడేలా నీటిమట్టం తగ్గిందని పలువురు చెబుతున్నారు.