తనపై ఆరోపణలను నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా

– తెదేపా ఎమ్మెల్యే బడేటి బుజ్జి
ఏలూరు, సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి) : తనపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెదేపా ఎమ్మెల్యే బడేటి బుజ్జి అన్నారు. శుక్రవారం ఆయన ఏలూరులో విలేకరులతో మాట్లాడారు. తనపై చేసిన విమర్శలను పవన్‌ కల్యాణ్‌ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొనేందుకు సిద్ధమని తెలిపారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అంటే తనకు భయం లేదని, ఆయన తనకు 40ఏళ్లుగా స్నేహితుడన్న సంగతి ఈ ప్రాంత వాసులకు తెలుసన్నారు. అలాగే భయపడే తత్వం తన రక్తంలో లేదన్నారు. స్కూలు భూములు కబ్జా చేశానంటున్నారు.. ఆధారాలతో సహ నిరూపించగలరా.. అంటూ పవన్‌ను ప్రశ్నించారు. ఏలూరులో తన హయాంలో ఎటువంటి పేకాట క్లబ్బులు రాలేదన్నారు. ఉన్న ఒక్క టౌన్‌ హాల్‌ కొంతమంది పెద్దలు చాలాకాలం క్రితం ఏర్పాటు చేసుకున్నారని  బడేటి బుజ్జి తెలిపారు. అలాగే లోకేష్‌కు శేఖర్‌రెడ్డికి సంబంధాలు ఉన్నాయని గతంలో పవన్‌ కల్యాణ్‌ ఆరోపణలు చేశారని, ఇప్పటికీ వాటిని నిరూపించలేకపోయారని ఆయన అన్నారు. పవన్‌ కల్యాణ్‌ కు సవాల్‌ విసురుతున్నా.. వారి మధ్య సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే… రాజకీయాల నుంచి తప్పుకుంటా…. అని ఆయన అన్నారు.

తాజావార్తలు