తమిళనాట రాజకీయ తుఫాన్
రాజకీయ పార్టీపై ప్రకటన చేసిన తలైవా
డిసెంబర్ 31న వివరాలు వెల్లడిస్తానన్న రజనీ
ఫుల్ జోష్‌లో రజనీ అభిమానులు ..తమిళనాట సంబరాలు
చెన్నై,డిసెంబర్3 (జనంసాక్షి) : తమిళ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతోంది. తుఫాన్ ఆవరించి ఉన్నవేళ తలైవా రాజకీయ తుఫాన్‌కు కారణమయ్యారు. ఇంతకాలం నాన్చుతూ వచ్చిన రాజకీయ పార్టీ ప్రకటనను ఎట్టకేలకు ప్రకటించేశారు. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మార్పులు స్పష్టంగా కానరానున్నాయి. ఇంతకాలం ఎటూ తేల్చలేక పోయిన సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. జనవరిలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు తలైవా గురువారం ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు డిసెంబరు 31న వెల్లడిస్తానని ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని, గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడును సమూలంగా మారుస్తామని పేర్కొన్నారు. తనకు మద్దతుగా నిలుస్తున్న వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. దీంతో తమకు అదిరిపోయే న్యూ ఇయర్ గిప్ట్ ఇచ్చారంటూ తలైవా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రజనీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రజనీ మక్కల్ మండ్రం ముఖ్య నిర్వాహకులు, జిల్లాల కార్యదర్శులతో సోమవారం రజనీకాంత్ భేటీ అయిన విషయం తెలిసిందే. చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపం వేదికగా ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ‘మా అభిప్రాయాలను పంచుకున్నాం. నేను ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అండగా ఉంటామనే భరోసా ఇచ్చారు. వీలైనంత త్వరగా నా నిర్ణయం ప్రకటిస్తాను’ అని రజనీ వెల్లడించారు. ఈ క్రమంలో నేడు పార్టీ ప్రారంభం గురించి ప్రకటన విడుదల చేయడం గమనార్హం. రజనీకాంత్ ఈ పేరు తెలియని భారతీయులు ఉండరనడంలో అతిశయోక్తేవిూ లేదు. రజనీ కాంత్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉంది. ఎంతలా అంటే అతడి కబాలీ సినిమాకు పెద్దపెద్ద సంస్థల ఉద్యోగులకు సెలవులు ఇచ్చి మరీ సినిమా చూసుకోమని చెప్పాయి. ఆ తరువాత తమిళనాడు రాజకీయాల్లోకి రజనీ అరంగేట్రం చేయనున్నాడని వార్తలు వచ్చాయి. అయితే అతని అభిమానులు ఎప్పుడెప్పుడు రాజనీ పార్టీ పెడతాడా అని ఎదురు చూశారు. ఇటీవల రజనీ తన ట్విటర్ ద్వారా తన కొత్త పార్టీ ప్రకటన గురించి తెలిపారు. తాను ఫేమ్ కోసమో,డబ్బుకోసమో రాజకీయాల్లోకి రావట్లేదని రజనీ ఇంతకు ముందే ఎన్నో సార్లు తెలిపారు. తన పార్టీకి సంబంధించిన సమాచారాన్ని డిసెంబరు 31న ప్రకటిస్తానని, పార్టీను మాత్రం వచ్చే ఏడాది జనవరీలో స్థాపిస్తామని రజనీ ఓ ట్వీట్ చేశారు. అంతేకాకుండా 2021 ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు. ప్రజాగళమై అవినీతి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే రజనీ పార్టీను పెడుతున్నారని అంటున్నారు. ఈ వార్త తమిళనాడు రాజకీయ పార్టీలలో పెన సంచలనంగా నిలిచింది. దీనిపై ఎవరు ఎలా స్తందిస్తారో చూడాలి. రజనీ పార్టీకు తమిళ ప్రజల ఆదరణ పూర్తి స్థాయిలో ఉంది. అయితే రజనీ పార్టీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం వేచి చూడాల్సిందే. ఇక సినీరంగం నుంచి రాజకీయాల్లో ప్రవేశించి ముఖ్యమంత్రులుగా తమదైన ముద్రవేసిన కరుణానిధి, జయలలిత మరణం తర్వాత తమిళనాట రాజకీయాలు అస్తవ్యస్తంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విశ్వనాయకుడు కమల్‌హాసన్, సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్లు మరింత ఉధృతమయ్యాయి. ఇక కమల్ ఇప్పటికే మక్కల్ నీది మయ్యం పేరిట పార్టీ స్థాపించగా.. 2017 డిసెంబరులో ‘అరసియల్‌కు వరువదు ఉరుది’ అంటే రాజకీయాల్లోకి రావడం ఖాయం అని బహిరంగంగా ప్రకటించిన తలైవా అనేక పరిణామాల అనంతరం పార్టీ స్థాపన దిశగా పయనించడం గమనార్హం.