తమ డిమాండ్లను నెరవేర్చండి

– లేకుంటే వచ్చే నెలలో దళిత సంఘాలతో కలిసి నిరసన చేపడతాం
– బీజేపీకి హెచ్చరికలు పంపిన ఎల్‌జేపీ చీఫ్‌ , కేంద్ర మంత్రి విలాస్‌ పాశ్వాన్‌
న్యూఢిల్లీ, జులై27(జ‌నం సాక్షి) : బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకి శత్రువులుగా మారుతున్న మిత్రుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా లోక్‌ జన శక్తి పార్టీ (ఎల్‌జేపీ) ఆ బాటలో పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎల్‌జేపీ చీఫ్‌, కేంద్ర మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ తన కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌తో కలిసి బీజేపీకి హెచ్చరికలు పంపారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే వచ్చే నెలలో దళిత సంఘాలతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటామని సందేశం పంపించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం నమోదయ్యే కేసుల విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దళితులకు ఆగ్రహం కలిగించిన సంగతి తెలిసిందే. ఈ చట్టం ప్రకారం ఆరోపణలను ఎదుర్కొంటున్న నిందితులను తక్షణమే అరెస్టు చేయరాదని, ముందుగా పోలీసు దర్యాప్తు జరగాలని, నిందితులకు బెయిలు మంజూరు చేసేందుకు అవకాశం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ ధర్మాసనంలో న్యాయమూర్తి జస్టిస్‌ ఏ కే గోయల్‌ పదవీ విరమణ చేశారు. ఆయనను జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ)కి చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. ఆయనను ఆ పదవి నుంచి తొలగించాలని రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌, ఆయన కుమారుడు చిరాగ్‌ డిమాండ్‌ చేస్తున్నారు. జస్టిస్‌ గోయల్‌ ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు.
విరాగ్‌ పాశ్వాన్‌ మాట్లాడుతూ తమ డిమాండ్‌ను వచ్చే నెల 9 నాటికి నెరవేర్చకపోతే తాము దళితుల నిరసనల్లో పాల్గొంటామన్నారు. ప్రభుత్వానికి తమ మద్దతు అంశాల ప్రాతిపదికపై ఉంటుందన్నారు. అయితే తాము తెలుగుదేశం పార్టీ మాదిరిగా ఎన్డీయే నుంచి బయటకు వెళ్ళబోమనే సంకేతాలు ఇచ్చారు. ప్రభుత్వంలో భాగంగా కొనసాగుతూనే దళితుల హక్కుల కోసం పోరాడతామన్నారు. తమ సహనం నశిస్తోందని, తమ డిమాండ్లపై పీఎం మోదీ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని చెప్పారు. జస్టిస్‌ గోయల్‌ను ఎన్‌జీటీ చైర్మన్‌ పదవి నుంచి తొలగించాలని కోరుతూ చిరాగ్‌ గురువారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీలపై దురాగతాల నిరోధక చట్టంలోని నిబంధనలను పునరుద్ధరించేందుకు పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టాలని వేర్వేరు లేఖల్లో రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌, చిరాగ్‌ పాశ్వాన్‌ ప్రధాని మోదీని కోరారు. బిల్లును ప్రవేశపెట్టడం సాధ్యం కానట్లయితే ఆర్డినెన్స్‌ జారీ చేయాలని డిమాండ్‌ చేశారు.