తల్లితండ్రుల మరణంతో అనాథలైన చిన్నారుల వ్యధ

కరీంనగర్, సెప్టెంబర్ 6: విధి ఆ కుటుంబాన్ని కాటేసింది. జిల్లాలోని మర్తన్నపేటలో తల్లితండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ముగ్గురు చిన్నారుల విషాధ ఘటన ఇది. కుటుంబ పెద్ద అయిన తండ్రి క్రిష్ణయ్య పది నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా కుటుంబ భారమంతా తల్లిపైనే పడింది. దీంతో ఆమె రోజు కూలి పని చేసి తన పిల్లలను పోసించుకుంటు వచ్చింది కాని విధి వారి కుటుంబం పై జాలి చూపించ లేదు . తండ్రి మరణించిన రీతిలోనే నేడు తల్లి కూడా అనారోగ్యంతో మృతి చెందింది దీంతో ముగ్గురు చిన్నారులు అనాథలై దిక్కుతోచని స్థితలో కన్నీరు పెట్టుకున్నారు. చివరకు తల్లి అంత్యక్రియలకు కూడా వారి వద్ద డబ్బులేక ఎవరిని అడగాలో తెలియక అలమిటిస్తున్నారు. చివరకు గ్రామస్థులు తలో రూపాయి ఆ చిన్నారులకు అందించారు. ఈ ముగ్గురు చిన్నారులు తల్లి మృతదేహం వద్ద అమ్మా ఇంక మాకు దిక్కెవరమ్మా, మేము ఎలా బతకాలని వారు కన్నీరు పెట్టుకుంటుంటే వారిని చూసిన గ్రామస్థులు ఏమి తెలియని ఈ చిన్నారులకు ఇంక దిక్కెవరు ఎలా బతుకు సాధిస్తారని గ్రామస్థులు కూడా కంటతడి పెట్టారు. చిన్నారులను ఆదుకోవాలని  పలు అనాథశ్రయాలను సంప్రదించగా తమ సహాయం చేస్తామని వారు తెలిపారు. ఈ ముగ్గురు చిన్నారులపై ప్రభుత్వం చొరవతీసుకొని ఆదుకోవాలని గ్రామస్థులు కో రుతున్నారు.