తాంబూలాలు ఇచ్చాం….తన్నుకు చావండి !
ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మడం ద్వారా ఆస్తులను సమకూర్చుకోవాలనుకుంటున్న బిజెపి ప్రభుత్వం దేశంలో తన అసమర్థ విధానాలను చాటుకుంటోంది. ఉన్న ఆస్తులను అమ్మి..పన్నులు పెంచి.. ఉపాధి.. ఉద్యోగావకాశాలు లేకుండా చేయడం ఏ రకమైన పాలనకిందకు వస్తుందో మోడీ అనుచరవర్గం..పేరుగాంచిన బిజెపి పెద్దలు.. చెప్పాలి. ఇంతపెద్ద యంత్రాంగం కలిగిన భారత ప్రభుత్వం ఉన్న ఆస్తులను కాపాడు కుంటూ.. ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచకుండా ఈ డబ్బును ఏంచేస్తున్నదనేదే అర్థం కాని ప్రశ్న. ఇది పూర్తిగా మోడీ అసమర్థ విధానాలకు….కార్పోరేట్ శక్తులకు కొమ్ముకాసి వారిని మరింత బలోపేతం చేసే యత్నాలకు మాత్రమే సమాధానంగా చూడాలి. రోజుకో ప్రభుత్వ సంస్థను అమ్మేస్తుంటే మనకొచ్చే ఆదాయం తగ్గిపోవడమే కాదు… బంగారు బాతు గుడ్డులాంటి సంస్థల ద్వారా మనకు పన్నుల రూపంలో వచ్చే ఆదాయం కూడా పడిపోతుందని గుర్తించడం లేదు. బి.ఎస్.ఎన్.ఎల్, విమాన సంస్థలు, పెట్రోలు సంస్థలు, బీమా, ఉక్కు, బ్యాంకులు ఇలా ఒక్కొక్కటీ అమ్మేస్తే మనకు మిగిలేదేముంటుందో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆలోచించాలి. అన్ని సంస్థలనూ అమ్మేస్తామని తాజాగా మన నిర్మలమ్మ ప్రకటించారు. మోడీ మాటలను ఆమె తన నోటి ద్వారా పలికారు. ఇలా ఒకదాని తరువాత ఒకటిగా ప్రభుత్వరంగ సంస్థల ను తెగనమ్ముతున్న మోడీ సర్కారు తాజాగా ప్రభుత్వ ఆస్తులపైనా కన్నేసింది. దేశ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ఆస్తులను అమ్మివేయాలని నిర్ణయించింది. ఈ పక్రియ ద్వారా రానున్న నాలుగేళ్ల కాలంలో 2025 ఆర్థికసంవత్సరాంతానికి 6లక్షల కోట్ల రూపాయల నిధులను సవిూకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు రూపొందించిన నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ అంటే ఎన్‌ఎంపి విధాన పత్రాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం సాయంత్రం ఆవిష్కరించారు. తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్న రీతిలో కేంద్రం తీరు ఉంది. మేం అమ్మాలనుకుంటున్నాం..ఏం చేసుకుంటారో చేసుకోండి…మాకు పార్లమెంటులో బలం ఉందన్న అహంకారంతో మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం మాట్లాడుతోంది. నిర్మలా సీతారమన్ పేర్కొన్న పత్రం ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2021`22 లోనే ఈ పక్రియ ప్రారంభం కానుంది. అంటే మరో రకంగా చెప్పాలంటే ప్రారంభించామని చెప్పకనే చెప్పారు. రోడ్లు, రైల్వేలు, విద్యుత్, సహజవాయువు, టెలికాం,గిడ్డంగులు, గనులు తదితర రంగాలకు చెందిన ఆస్తులు కేంద్రం అమ్మనున్న జాబితాలో ఉన్నాయి. అత్యధికంగా రోడ్లు (27శాతం) రైల్వే (25శాతం)విద్యుత్ (15శాతం) రంగాలకు చెందిన ఆస్తులను అమ్మనున్నారు. ఇప్పటికి గుర్తించిన ఆస్తుల విలువే ఆరులక్షల కోట్ల రూపాయలుగా పేర్కొన్న కేంద్రం దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్న వివిధ ఆస్తులను కూడా త్వరలో గుర్తించి ఈ పథకం కిందకు తీసుకువస్తామని విధానపత్రంలో పేర్కొంది. ఇందులో మనమంతా పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు కూడా ఉందని గుర్తించాలి. ఇక మనమెంత అరచి గీపెట్టినా, మనమెంతా ఆందోళనలను చేసినా మన విశృాఖ ఉక్కు తుక్కు అని గుర్తించాలి. అది మనది కాదని భావించాలి. మన పోరాటం పోరాటం కాదని గుర్తించాలి. అయితే ఆస్తుల అమ్మకంలో ఆయా రాష్టాల్రతో చర్చలకు సంబంధించిన ఎటువంటి ప్రణాళికను కేంద్రమంత్రి పేర్కొనలేదు. ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిన తరువాత కూడా వాటిపై యాజమాన్య హక్కు ప్రభుత్వానికి ఉంటుందని విధానపత్రంలో పేర్కొన్నారు. అయితే, వాటిని ఎలా ఉపయోగించుకుంటారన్నది ప్రైవేటు సంస్థల ఇష్టం. ఆస్తులను కొన్ని సంవత్సరాల పాటు ప్రైవేటు సంస్థలకు అప్పగించన్నుట్లు విధానపత్రంలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కనిష్ట, గరిష్ట పరిమితిని పేర్కొనలేదు. దానికి గానూ ప్రైవేటు సంస్థలు
ముందుగానే ప్రభుత్వానికి నగదు చెల్లించాలి. ఆ తరువాత ప్రజల నుండి వినియోగఛార్జీల రూపంలో వసూలు చేసుకోవాలి. దీనికి సంబంధించి మూడు పద్దతులను పేర్కొన్నారు. ఒకటి ఇప్పటికే తెలిసిన టోల్ మోడల్! రెండవది ఇన్‌ఫ్రాస్టక్చర్ర్ ఇన్వెస్టిమెంట్ ట్రస్ట్స్ (ఐఎన్‌విఐటి) , రియల్ ఎస్టేట్ ఇన్వెస్టిమెంట్ ట్రస్ట్ (ఆర్‌ఇవిఐటి). ఈ విధానంలో మ్యూచవల్ ఫండ్స్ తరహాలో ప్రైవేటు సంస్థలు, ప్రజల నుండి పెట్టుబడులు సేకరిస్తారు. ప్రాజెక్టు నిర్వహణను ఏదైనా సంస్థకు అప్పగిస్తారు. ఆ సంస్థ ప్రతి ఏడాది లాభాలను వాటాదారులకు చెల్లిస్తుంది. 2022 మార్చి నాటికి ఎన్‌హెచ్‌ఎఐ మొదటి ఐఎన్‌విఐటి ప్రాజెక్టును ప్రకటించే అవకాశం ఉంది. ఇవి రెండూ కాకుండా హైబ్రిడ్ యాన్యుటి మోడల్ అనే మరో పద్దతిని కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిలో ఆస్తులను ప్రైవేటు సంస్థలకు అప్పగించినప్పటికీ, టోల్ వసూలను ప్రభుత్వమే చేసి సంబంధిత సంస్థలకు అప్పగిస్తుంది. అసంపూర్ణంగా ఉన్న నిర్మాణ పనులను పూర్తి చేయడానికి 40 శాతం మొత్తాన్ని చెల్లిస్తుంది. మొత్తంగా ప్రైవేట్ సంస్థలు కూడా దళారీ పాత్ర పోషిస్తాయని అర్థం అవుతుంది. ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వ ఆస్తులను తమ గుప్పిట్లో పెట్టుకుని ప్రజలనుంచి ముక్కుపిండి వసూలు చేస్తాయి. వివిధ పథకాల కింద ఇప్పటికే పనులు ప్రారంభమై ఇంకా పూర్తికానివి, పూర్తయినా నిరుపయోగంగా ఉన్న ఆస్తులను బ్రౌన్‌ఫీల్డ్ అస్సెట్స్‌గా విధానపత్రంలో పేర్కొన్నారు. వీటితో పాటు నిర్ధేశించిన లక్ష్యం మేరకు ఆదయాన్ని సమకూర్చని ఆస్తులను కూడా అమ్మివేయనున్నారు. ఈ తరహా ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు అప్పచెబుతామని నిర్మలా సీతారామన్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్న ఈ తరహా ఆస్తులను కూడా త్వరలో గుర్తించనున్నారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న 25 విమానాశ్రయాలు, 40 రైల్వే స్టేషన్లు, 15 రైల్వే స్టేడియాలు ప్రయివేటుకు అప్పగించే జాబితాలో ఉన్నాయని సమాచారం. బిఎస్‌ఎన్‌ఎల్, ఎంటిఎన్‌ఎల్‌కు సంబంధించి 14,917 సిగ్నల్ టవర్లు, 2.86 లక్షల కిలోవిూటర్ల భారత్‌నెట్ ఫైబర్, రూ.24,462 కోట్ల విలువ చేసే 8,154 కిలోవిూటర్ల సహజ వాయువు పైపులైన్లు, రూ.22,504 కోట్ల విలువ చేసే ఇతర ఉత్పత్తుల పైపులైన్లను కూడా కేంద్రం అమ్మకా నికి పెట్టనుంది. ఎంతో కష్టపడి సమకూర్చిన ఆస్తులను మోడీ చిటికెలో అమ్మేయడానికి నిర్ణయించు కోవడం.. కనీసం దీనిపై పార్లమెంటులో చర్చ చేయకపోవడం నిరంకుశ విధానాలరు పరాకష్టగా చూడాలి.