తాజ్‌ భద్రత నిర్లక్ష్యంపై..

కేంద్రం, యూపీ ప్రభుత్వాలపై మండిపడ్డ సుప్రీం
– భద్రత ఎవరు తీసుకుంటారో విూరే తేల్చుకోండి!
– యునెస్కో గుర్తింపు కొల్పోయే ప్రమాదంపై సుప్రీం ఆందోళన
ఢిల్లీ, జులై27(జ‌నం సాక్షి): తాజ్‌మహల్‌ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర, యూపీ ప్రభుత్వాలపై సుప్రిం కోర్టు మండిపడింది. భద్రత ఎవరు తీసుకుంటారో విూరే తేల్చుకోండి అంటూ అసహనం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు గతనెల 31 నుంచి రోజువారీ విచారణ చేపడుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం కూడా దీనిపై విచారణ జరగింది. అయితే, శుక్రవారం విచారణలో భాగంగా కేంద్రం, యూపీ ప్రభుత్వాలపై మండిపడింది. చారిత్రక కట్టడం తాజ్‌పై ఇరు ప్రభుత్వాలు ఇప్పటికే చాలా నిర్లక్ష్యం ప్రదర్శించాయని ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీనివల్ల యునెస్కో వారసత్వ గుర్తింపు కోల్పోయే ప్రమాదంలో తాజ్‌ పడిందని  ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు ప్రభుత్వాలలో తాజ్‌ పరిరక్షణ, నిర్వహణ బాధ్యతలు ఎవరు తీసుకుంటారో విూరే తేల్చుకోవాలని కోర్టు కేంద్రం, యూపీ ప్రభుత్వాలకు సూచించింది. జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌, దీపక్‌ గుప్తాతో కూడి ద్విసభ్య ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. ‘యునెస్కో వారసత్వ గుర్తింపు కోల్పోవడం కంటే దేశానికి తలవంపులు మరొకటి ఉండదు. తాజ్‌పై ఇకనైనా శ్రద్ధ పెడితే ఆ ప్రమాదం నుంచి బయటపడవచ్చు. దీనిపై తక్షణ చర్యలు తీసుకోండి. ఏ యే చర్యలు తీసుకుంటున్నారో కూడా చెప్పాల్సిన బాధ్యత విూదే.’ అని ధర్మాసనం తెలిపింది. గురువారం విచారణలో భాగంగా తాజ్‌మహల్‌ నిర్వహణతో పాటు పరిసరాల పరిరక్షణ, అభివృద్ధి, వాహనాల రద్దీ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలతో కూడిన 220 పుటల నమూనా నివేదికను యూపీ ప్రభుత్వం సమర్పించింది. తాజ్‌మహల్‌ భద్రత, పరిరక్షణకు రూపొందించిన నమూనా దార్శనికపత్రాన్ని తమకెందుకు ఇచ్చారని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మండిపడింది. దాన్ని పరిశీలించి, తప్పొప్పులను సరిచేయడం మా పని అనుకుంటున్నారా? అంటూ ఘాటుగా ప్రశ్నించింది