తాడిపత్రిలో కొనసాగుతున్న ఉద్రిక్తత

– రాత్రంతా పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే జేసీ దివాకర్‌రెడ్డి
– ఆశ్రమాన్ని మూసేసే వరకు ఆందోళన విరమించనన్న జేసీ
– దివాకర్‌కు ఫోన్‌ చేసి మాట్లాడిన చంద్రబాబు
– ఆశ్రమ నిర్వాహకులపై చర్యలకు జేసీ డిమాండ్‌
– అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయని ఫిర్యాదు
– ప్రభోదానంద శిష్యులను తరలించేందుకు పోలీసుల సన్నాహాలు
– తాడిపత్రి ఘటనపై చంద్రబాబు సవిూక్ష
అనంతపురం, సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి ) : అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్‌ మండలంలో రెండ్రోజుల క్రితం చెలరేగిన ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు. చిన్నపొడమల, పెద్దపొడమల గ్రామస్తులకు, ప్రబోధానందస్వామి వర్గీయులకు మధ్య తలెత్తిన గొడవలో ఇప్పటివరకూ ఓ సీఐ సహా 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘర్షణలో కొందరు దుండగులు ఇద్దరు వ్యక్తుల గొంతును కోయగా, ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో తాడిపత్రి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట గ్రామస్తులకు మద్దతుగా ఆదివారం రాత్రి బైఠాయించిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి బైఠాయించారు. రాత్రంతా అక్కడే గడిపారు. దీంతో పోలీసులు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. తాజాగా సోమవారం ఉదయం జేసీ దివాకర్‌ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్‌ చేశారు. అక్కడి పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులపై దాడికి పాల్పడిన నిందితులను అరెస్ట్‌ చేయాలని చంద్రబాబును జేసీ కోరారు. గ్రామస్తులకు న్యాయం జరిగే వరకూ తాను పోలీస్‌ స్టేషన్‌ ఎదుట నుంచి కదలబోనని వెల్లడించారు. ప్రతి పౌర్ణమి, అమావాస్య రోజున పూజల పేరుతో ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆయన సీఎంకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ పెద్దిరెడ్డిని హైదరాబాద్‌ కు తరలించినట్లు జేసీ విూడియాకు తెలిపారు. ఈ ఘటనలో కళ్లు దెబ్బతిన్న వారికి మెరుగైన చికిత్స కోసం నిపుణుల్ని అనంతపురానికి రప్పిస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌ పాండియన్‌, జాయింట్‌ కలెక్టర్‌, ఆర్డీవో, ఎమ్మార్వో, డీఎస్పీతో నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు.
శాతిభద్రతల విషయంలో ఎవరినీ ఉపేక్షించం – చంద్రబాబు
అనంతపురం జిల్లా తాడిపత్రి పరిధిలోని చిన్నపొలమడలో చోటుచేసుకున్న ఘటనపై పోలీసు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో అనంతపురం జిల్లా తెదేపా నేతలు కూడా పాల్గొన్నారు. శాంతిభద్రతలు కాపాడే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడేది లేదని సీఎం స్పష్టం చేశారు. శాంతిభద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికార పార్టీల నేతలు ఎవరైనా శాంతిభద్రతల ఉల్లంఘనకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కరవు జిల్లా అయిన అనంతపురంలో కియా లాంటి పరిశ్రమల వల్ల మంచిపేరు వస్తుంటే.. కొందరి తీరు వల్ల అక్కడ చెడ్డపేరు వచ్చే పరిస్థితి తలెత్తరాదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీలకు అతీతంగా పోలీసులు అక్కడ పరిస్థితులు అదుపులో ఉండేలా ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవాలని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది.
జగన్‌ను కలిసిన ప్రభోదానంద భక్తులు ..
గణెళిష్‌ నిమజ్జనం సందర్భంగా అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో ఉద్రిక్త పరిస్థితులు
నెలకొన్నాయి…  చిన్నపోలమడలో జరిగిన ఈ ఘటనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి బైఠాయింపుతో మరింత టెన్షన్‌ ఏర్పడగా… సీఎం చంద్రబాబు ఈ ఘటనపై ఆరా తీసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మరోవైపు ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిశారు ప్రభోదానంద ఆశ్రమానికి చెందిన భక్తులు. విశాఖ జిల్లాలో జగన్‌ను కలిసిన ప్రభోదానంద భక్తులు… జేసీ వర్గీయుల దౌర్జన్యాన్ని జగన్‌ను విరించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, తాడిపత్రిలో రౌడీ రాజ్యం కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తన వాళ్లను ఎందుకు కట్టడి చేయలేక పోతున్నారు అంటూ జగన్‌ ప్రశ్నించారు. ఆశ్రమంలో ఒక స్వామితో ఇంత విభేదాలు ఎందుకని మండిపడ్డారు. జగన్‌ను కలిసిన సందర్భంగా ప్రభోదానంద ఆశ్రమానికి చెందిన భక్తులు టీడీపీ ఎంపీ జేసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తాడిపత్రిలో ఎవరీ అదృశ్య బాబా..!
గత రెండు రోజులుగా తాడిపత్రి మండలంలో చెలరేగిన ఘర్షణతో స్వామి ప్రబోధానంద ఆశ్రమం ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. భక్తులు గ్రామస్థులపై దాడి చేయడంతో ఆశ్రమంలో ఏం జరుగుతుందనే దానిపై అనుమానాలు రేగుతున్నాయి. చిన్నపొలమడ, పెద్దపొలమడ గ్రామాల్లో తలెత్తిన వివాదం ఒకరిపై మరొకరు దాడులు చేసుకునేంత వరకు వెళ్లింది. వినాయక నిమజ్జన శోభాయాత్ర ఆశ్రమం విూదుగా తరలించవద్దని ప్రబోధానంద శిష్యులు అడ్డుకోవడంతో తాడిపత్రి మండలంలో ఉద్రిక్తత నెలకొంది.
ఆశ్రమంలో అణువణువు అనుమానాస్పదంగానే కనిపిస్తుంది. బయటకు తెలియని పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండు రోజులు గా జరుగుతున్న పరిణామాలతో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆశ్రమంలోకి ప్రవేశించారు. ప్రబోధానంద ఇప్పటి వరకు గ్రామస్థులకు కనిపించలేదు. అయినా గురువు ఏంచెబితే భక్తులు దానిని పాటిస్తారని తెలుస్తుంది. ఆశ్రమంలో కేవలం పూజలు మాత్రమే నిర్వహిస్తారు, కొత్త వారిని ఎవరినీ రానివ్వరు అని అధికారులు అంటున్నారు. నాలుగు అంతస్తుల భవంతిలో నివాస ఏర్పాట్లు, భారీ స్కీన్లు అమర్చారు. వీటిపై ప్రబోధానంద ప్రవచనాలను భక్తులకు చూపిస్తారు. ఆశ్రమం చుట్టు ప్రైవేట్‌ సెక్కూరిటీ, సీసీ కెమెరాలను అమర్చారు. భక్తులు, సిబ్బందిని అప్రమత్తం చేసేందుకు సైరన్‌ వ్యవస్థ, ఆశ్రమం లోపల కర్రలు, రాళ్లు సిద్ధంగా ఉంచినట్లు అధికారులు గుర్తించారు.

తాజావార్తలు