తాడేపల్లి గురుకులంలో టీచర్స్‌డే ఉత్సవాలు
గుంటూరు,సెప్టెంబర్5(జనం సాక్షి): తాడేపల్లి గురుకులం సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బుధవారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి దేశానికి ప్రథమ పౌరుడిగా సేవలందించిన మ¬న్నత వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. తల్లిదండ్రుల తర్వాత గౌరవించదగ్గ వ్యక్తి ఉపాధ్యాయుడని అన్నారు. మంచి ఉపాధ్యాయుడిని విద్యార్థులు జీవితాంతం గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూల్స్‌లో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన విద్యా సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. ఎన్టీఆర్ స్థాపించిన గురుకుల సొసైటీలో పని చేసే ఉపాధ్యాయులు చిత్త శుద్ధితో పని చేసినప్పుడే విద్యార్థులను ఉన్నతమైన విద్యార్థులుగా తీర్చిదిద్దుతారని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గురుకుల సొసైటీ విద్యార్థులు అనేక రికార్డులు నెలకొల్పుతున్నారని అభినందించారు. గురుకుల సొసైటీలో పని చేస్తున్న పార్ట్ టైం ఉపాధ్యాయులకు కూడా రెగ్యులర్ ఉపాధ్యాయులతో పాటుగా సమానంగా వేతనం పెంచుతున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నక్కా ఆనందబాబు, సోషల్, ట్రైబల్ వెల్‌ఫేర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రావత్, గురుకులం సెక్రెటరీ రాములు, గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.