తిత్లీ తుఫాను బాధితులకు కేంద్రం మొండిచేయి

– 200 కోట్లతో సరిపెట్టారు: ప్రత్తిపాటి
విశాఖపట్టణం,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): తిత్లీ తుపాను కారణంగా రూ.3,600 కోట్లు నష్టం వాటిల్లితే కేవలం రూ.200 కోట్లతో కేంద్రం సరిపెట్టుకోమందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. విశాఖలో మంత్రి విూడియాతో మాట్లాడుతూ.. చిన్న చూపు చూసిన కేంద్రాన్ని నిలదీసే ధైర్యం ప్రతిపక్ష వైకాపాకు లేదని విమర్శించారు. తక్షణ సాయంగా రూ.1200 కోట్లు ఇవ్వాలని అడిగినప్పటికీ కేంద్రం స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. తిత్లీ తుపాను బాధితులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అదుకోవడం వల్లే ఆ ప్రాంతంలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు.
చంద్రన్న కానుకల నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. శనివారం మర్రిపాలెంలోని పౌరసరఫరాల గోడౌన్లలో మంత్రి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంచదారలో క్రిస్టల్‌ తక్కువగా ఉంటే తిరిగి పంపిస్తామన్నారు.మల్టీప్లెక్స్‌లు చేస్తోన్న దోపిడీపై నిరంతర పర్యవేక్షణ అవసరమని మంత్రి పుల్లారావు పేర్కొన్నారు.