తిరిగి సిఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతా

ఎపి అసెంబ్లీలో చంద్రబాబు భీషణ ప్రతిజ్ఞ

చంద్రబాబు లక్ష్యంగా అధికార వైసిపి ఎదురుదాడి

కుటుంబ సభ్యులనూ వదలకుండా విమర్శలుదూషణలపై కంటతడిపెట్టిన చంద్రబాబు

అమరావతి,నవంబర్‌19(జనం సాక్షి  ) : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. తాను తిరిగి సీఎం అయ్యాకే సభలో అడుగుపెడతానంటూ శపథం చేసి అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు. అసెంబ్లీలో తనపై జరిగిన వ్యక్తిగత దాడి…కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా సపందించారు. ఒక సందర్బంలో ఆవేదనకు లోనై కన్నీరు పెట్టుకున్నారు. అసెంబ్లీ ప్రారంభమైంది మొదలు టీడీపీతో పాటు పార్టీ అధినేతపై దూషణల పర్వానికే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రాధాన్యం ఇచ్చారు. ఒకవైపు మంత్రి కొడాలి నాని.. చంద్రబాబును ’లుచ్ఛా’ అంటూ నోటికి పని చెబుతుండగా.. మరోవైపు మరో మంత్రి కన్నబాబు, ఇతర ఎమ్మెల్యేలు తమదైన శైలిలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగక చంద్రబాబును అవమానపరుస్తూ మాట్లాడటమే కాకుండా ఆయన కుటుంబంలోని మహిళలపై సైతం నోరు పారేసుకున్నారు. ఆయన భార్యతో పాటు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తీవ్ర మనస్థాపానికి గురైన చంద్రబాబు కంటతడి పెట్టారు. అనంతరం ఆయన సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. పెద్ద పెద్ద మహానాయకులతో పని చేశాం. జాతీయ స్థాయిలో కూడా అనేక మంది నాయకులతో పని చేశాం. గడిచిన రెండున్నరేళ్లుగా సభలో ఎన్నో విమర్శలు.. ప్రతి విమర్శలు చేసుకున్నాం. ఏనాడూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ.. రూలింగ్‌లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఇలాంటి అనుభవాలు నేను చూడలేదు. అదే విధంగా ఇన్నేళ్లుగా జరగని అవమానాలను భరించాం. నిన్న కూడా ముఖ్యమంత్రి.. కుప్పం ఎన్నికల తర్వాత నేను రావాలి. నా ముఖం చూడాలన్నా కూడా వ్యక్తిగతంగా తీసుకోలేదు. ఈ హౌస్‌లో పడరాని అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన సందర్భాలున్నాయి. వ్యక్తిగతంగా, పార్టీ పరంగా విమర్శించారు. ఇన్ని సంవత్సరాలుగా ఏ పరువు కోసం పని చేశానో.. ఇన్నేళ్లుగా బతికామో.. నా కుటుంబం, నా భార్య విషయం కూడా తీసుకొచ్చి అవమానిం చారు. మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతానని అంటూ అని చంద్రబాబు అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు. అంతకుముందు ఏపీ అసెంబ్లీలో తీవ్ర వాగ్వాదం జరిగింది. వ్యవసాయంపై చర్చ వ్యక్తిగత విమర్శలకు దారితీసింది. అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య కామెంట్లు, కౌంటర్లు నడిచాయి. అంబటి రాంబాబు, చంద్రబాబు మధ్య వాగ్వాదం నడిచింది. ఇరు వైపుల నుంచి పెద్దయెత్తున నినాదాలు చేశారు. అరగంటకు పైగా ఈ గొడవే కొనసాగింది. సభలో పరిణామాలపై చంద్రబాబు తీవ్ర మనస్తాపం చెందారు. అసెంబ్లీ సమావేశాల నుంచి చంద్రబాబు వాకౌట్‌ చేశారు. తన పరువునే కాకుండా, కుటుంబ పరువును తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు. సభ్యులకు నమస్కరిస్తూ సభ నుంచి నిష్కమ్రించారు. సభలో తన భార్య గురించి మాట్లాడటంపై పార్టీ ఎమ్మెల్యేల భేటీలో తీవ్ర ఎమోషనల్‌ అయిన బాబు.. కన్నీళ్లు పెట్టుకున్నారు. సభలో తన కుటుంబం గురించి మాట్లాడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత సవాల్‌ చేశారు. మళ్లీ గెలిచిన తర్వాతే అసెంబ్లీకి వస్తానని శపథం చేశారు. ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానన్నారు.బాబు మాట్లాడుతుండగానే స్పీకర్‌ మైక్‌ కట్‌ చేశారు. దీంతో సభ నుంచి మాజీ ముఖ్యమంత్రి వెళ్లిపోయారు. ఆయన వెంటే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా బయటికొచ్చేశారు. ఇదంతా జరుగుతున్నప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు అవహేళనగా నవ్వుతూ ఉండటం గమనార్హం.