తిరుపతిని మెడికల్ హబ్‌గా మార్చుతాం
– ప్రారంభ దశలోనే చికిత్స అందిస్తే క్యాన్సర్‌ను అరికట్టవచ్చు
– ప్రభుత్వాలు చేయలేని పనిని టాటా ట్రస్ట్ చేస్తోంది
– ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
– తిరుపతిలో క్యాన్సర్ ఆస్పత్రికి భూమిపూజ చేసిన సీఎం, రతన్‌టాటా
తిరుపతి, ఆగస్టు31(జనం సాక్షి) : తిరుపతిని మెడికల్ హబ్‌గా మార్చుతామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలో వెంకటేశ్వర కేన్సర్ వైద్య, విజ్ఞాన సంస్థ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు టాటా ట్రస్ట్ ఛైర్మన్ రతన్ టాటాతో కలిసి శుక్రవారం భూమి పూజ చేశారు. వెంకటేశ్వర జంతు ప్రదర్శన శాల సవిూపంలో ఈ వైద్యశాలను టాటా ట్రస్ట్ నిర్మిస్తోంది. తితిదే కేటాయించిన 25ఎకరాల స్థలంలో రూ.1000 కోట్లతో ఈ ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. మొత్తం వెయ్యి పడకల గానూ తొలి దశలో 376 పడకలతో ఈ ఆస్పత్రి ప్రారంభిస్తారు. ఈ ఆస్పత్రి ద్వారా రోగులకు క్యాన్సర్ చికిత్సతో పాటు దేశంలోని టాటా క్యాన్సర్ చికిత్స కేంద్రాల పరిధిలో పరిశోధనలు చేపడతారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. జంతుప్రదర్శనశాల సవిూపంలో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం జరుగుతుందన్నారు. 25 ఎకరాల స్థలంలో రూ. వెయ్యి కోట్లతో ఆస్పత్రి నిర్మించనున్నట్లు చెప్పారు. మొదటి విడతలో 350 పడకలతో ఆస్పత్రి నిర్మాణం ఉంటుందన్నారు. క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటుకు చొరవ చూపిన… టాటా ట్రస్ట్‌కు చంద్రబాబు అభినందనలు తెలిపారు. ప్రభుత్వాలు చేయలేని పనిని టాటా ట్రస్ట్ చేస్తోందన్నారు. 124 ఆస్పత్రులు టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయని సీఎం తెలిపారు. తిరుపతి ఆస్పత్రి రేడియేషన్ థెరపీకి హబ్‌గా మారుతుందని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. రోగుల బంధువుల కోసం వసతి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. మహిళలు ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకోవాలని, ఒత్తిడి, మద్యం, సిగరెట్లకు దూరంగా ఉంటే క్యాన్సర్‌ను నివారించవచ్చునని చంద్రబాబు పేర్కొన్నారు. వారసత్వ క్యాన్సర్లపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ ఆస్పత్రి ఏర్పాటుతో క్యాన్సర్‌ను 75 శాతం ముందే గుర్తించవచ్చునని చంద్రబాబు అన్నారు. చివరి దశలో గుర్తించడం వల్లే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అన్ని జిల్లాల్లో క్యాన్సర్ ఆస్పత్రులు ఏర్పాటు
చేయాలని, క్యాన్సర్‌పై అవగాహన చాలా ముఖ్యమన్నారు. ముందుగా గుర్తిస్తే క్యాన్సర్‌ను నివారించవచ్చునని చంద్రబాబు అన్నారు. తిరుపతి అనేక రంగాల్లో నెంబర్ వన్ స్థానంలో ఉందని, తిరుపతిని మెడికల్ హబ్‌గా తయారు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. తిరుపతి స్మార్ట్ సిటీగా తయారవుతోందన్నారు. తిరుపతి ఎయిర్‌పోర్టు రన్‌వేను విస్తరిస్తున్నామని, హార్డ్‌వేర్ హబ్‌గా తిరుపతిని తయారుచేస్తామని సీఎం పేర్కొన్నారు. సెల్‌ఫోన్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా తిరుపతి తయారవుతుందని, మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్‌లను డిసెంబర్‌లోగా పూర్తి చేసి సోమశిల నుంచి నీళ్లు ఇచ్చే బాధ్యత తమదేనని చంద్రబాబు స్పష్టం చేశారు.