తిరుపతి కోర్టు సంచలన తీర్పు

అత్యాచార నిందితులకు 20 ఏళ్ల జైలు

తిరుపతి,జూలై17(జ‌నం సాక్షి): ఓ వివాహితపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులకు 20ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తిరుపతి నాల్గో అదనపు జిల్లా సెషన్సు న్యాయమూర్తి జి.రాంగోపాల్‌ తీర్పు వెలువరించారు. నాలేగుళ్ల క్రితం సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులకు జైలుశిక్ష పడడంతో స్థానికంగా హర్షం వ్యక్తం అయ్యింది. కడప జిల్లా రాజంపేట మండలం మండపల్లికి చెందిన బాధితురాలు ప్రస్తుతం రేణిగుంట కరకంబాడి తారకరామానగర్‌లోని తన తండ్రి వద్ద ఉంటోంది. ఆమెకు గతంలో ఓ వ్యక్తితో వివాహమైంది. మనస్పర్థలతో బాధితురాలు తండ్రి వద్ద ఉంటోంది. తండ్రి అమరరాజా ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. బాధితురాలు అదే ఫ్యాక్టరీలోని క్యాంటీన్‌లో పనికి కుదిరింది. ఉదయం 11గంటలకి వెళ్లి తిరిగి రాత్రి 9.30కి ఇంటికి చేరుకుంటుంది. అదే ప్రాంతానికి చెందిన నిందితులు కె.ప్రేమ్‌ కుమార్‌, గుండ్రాళ్ల చలపతి ఆమెపై కన్నేశారు. బాధితురాలిని సోదరుడు ఉదయ్‌కిరణ్‌ ప్రతిరోజు రాత్రి ఇంటికి తీసుకువస్తాడు. నిందితులు అవకాశం కోసం ఎదురుచూసి 2014 నవంబరు 19న ఆమె విధులు ముగించుకుని తన సోదరుడితో ఇంటికి నడిచి వస్తుండగా మొదటి నిందితుడు ప్రేమ్‌ కుమార్‌ వారిని తన తన మోటారు సైకిల్‌పై ఎక్కించుకొని కొంతదూరం తీసుకెళ్లి బైక్‌ని ఆపాడు. వాహనంలో పెట్రోలు తక్కువగా ఉందని మొదట బాధితురాలి సోదరున్ని ఇంటి వద్ద వదిలి పెట్రోలు పట్టుకుని తరువాత ఆమెను ఇంటికి చేరుస్తానని నమ్మబలికాడు. చెప్పినట్లుగానే సోదరుడ్ని ఇంటివద్ద దింపాడు. ప్రేమ్‌కుమార్‌ చలపతిని తన బైక్‌లో ఎక్కించుకుని బాధితురాలి వద్దకి వచ్చి ఆమెని బలవంతంగా ద్విచక్ర వాహనంలో తీసుకుని రెండో నిందితుడి ఇంటికి చేరుకున్నారు. తలుపులు బంధించి ఆమెపై అత్యాచారం చేశారు. ఈ ఘటనపై ఆమె తండ్రి రేణిగుంట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. అప్పటి సీఐ రామచంద్రారెడ్డి కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్టుచేసి న్యాయస్థానంకి అప్పగించారు. కేసు సాక్ష్యాధారాలతో నిరూపితమైంది. దీంతో జడ్జి ఇద్దరికి ఇరవై ఏళ్ల శిక్ష విధించారు.

———-

 

తాజావార్తలు