తిరుపతి రెవెన్యూ కార్యాలయంలో తనిఖీలు

తిరుపతి, జులై17(జ‌నం సాక్షి) : స్థానిక నివాసుల ఫిర్యాదు మేరకు విజిలెన్స్‌ అధికారులు మంగళవారం రెవెన్యూ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.  చిత్తూరు జిల్లా, తంబల్లపల్లి తాలూకా, బి.కొత్తకోట పట్టణంలోని సర్వే నెంబర్‌ 466 లో 2 ఎకరాల 02 సెంట్లు భూమిలో గత 10 సంవత్సరాల నుంచి గృహాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో రెవిన్యూ సిబ్బంది నిర్లక్ష్యంతో ఈ ఇళ్లున్న భూమిని వ్యవసాయ భూమిగా మార్చి పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేయడంతో విషయం ముదిరి పాకాన పడింది. గతంలో మదనపల్లి ఇంచార్జ్‌ సబ్‌ కలెక్టర్‌ పట్టణంలో ఉన్న సర్వే నెంబర్‌ వద్దకు చేరుకొని రెవెన్యూ రికార్డులను సైతం పరిశీలించారు. ఈ విషయంపై స్థానిక నివాసాల వారు తిరుపతి లోని విజిలెన్స్‌ ఎన్ఫోర్‌మెంట్‌ అధికారులకు ఫిర్యాదు చేయడంతో మంగళవారం అకస్మాత్తుగా విజిలెన్స్‌ అధికారులు దాడిచేసి ఎమ్మార్వో ఆఫీస్‌లో దస్త్రాలు పరిశీలించారు. స్థలం వద్దకు చేరుకుని అక్కడ అందరి అభిప్రాయాలు, ఆధారాలు సేకరించి రికార్డులన్నీ స్వాధీనం చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు పూర్తి చేస్తామని, తప్పు చేసిన వాళ్లని విధుల నుంచి తొలగిస్తామని అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానికులు తమకు న్యాయం చేయాలంటూ అధికారులను వేడుకున్నారు.

తాజావార్తలు