తిరుమలలో భారీ వర్షం

– విరిగి పడిన కొండ చరియలు

చిత్తూరు, నవంబర్‌22(జ‌నంసాక్షి) : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాలో గురువారం భారీవర్షాలు కురిశాయి. ఉత్తర తమిళనాడులోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తిరుమలను ఎడతెరిపి లేని వర్షం ముంచెత్తింది. రహదారులు జలమయమయ్యాయి. పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొన్నారు. బుధవారం వర్షం కురవడంతో సాయంత్రానికి 15 సెంటీవిూటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో తిరువీధులు, రహదారులు జలమయమయ్యాయి. దుకాణదారులు, భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భారీ వర్షాలతో కనుమ దారిలో అక్కడక్కడా కొండచరియలు విరిగిపడ్డాయి. భద్రతా సిబ్బంది కొండచరియలను తొలగించి భక్తులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్త వ్యవహరించారు. కొండచరియలు విరిగే అవకాశం ఉన్న చోట ముందస్తు చర్యగా జేసీబీలను అందుబాటులో ఉంచారు. గురువారం ఉదయం కూడా అక్కడక్కడా కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఇదిలా ఉంటే అల్పపీడన ప్రభావంతో ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆరు జిల్లాల్లోని పాఠశాలలకు తమిళనాడు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. పుదుచ్ఛేరిలోనూ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మరో 24 గంటల పాటు వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది.