తిరుమల బాలుడి కిడ్నాప్‌ కేసులో పురోగతి

నిందితుడి ఫోటో విడుదల చేసిన పోలీసులు
రంగంలోకి దిగిన బృందాల గాలింపు
తిరుమల,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): తిరుమలలో ఏడాదిన్నర బాలుడి కిడ్నాప్‌ కేసులో పోలీసులు కాస్త పురోగతి సాధించారు. నిందితుడి ఫోటోను విడుదల చేయడంతో పాటు అతను నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు బృందాన్ని నెల్లూరుకు పంపారు. నిందితుడు చిన్నారితో సహా రైలు ఎక్కినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపడంతో పాటు దర్యాప్తు ముమ్మరం చేశారు. తిరుమలలో ఏడాదన్నర బాలుడి కిడ్నాప్‌ కలకలం సృష్టించింది. మహారాష్ట్ర లాథూర్‌ నుంచి వచ్చి ప్రశాంత్‌, దాలింభాయ్‌ దంపతుల కొడుకు వీరేష్‌ నిన్న ఉదయం అద?శ్యమయ్యాడు. శ్రీవారి దర్శనానికి వచ్చిన ప్రశాంత్‌ కుటుంబం తమకు రూమ్‌ దొరక్కపోవడంతో యాత్రి సముదాయం-2 ఎదురుగా ఉన్న షెడ్‌లో సేదతీరింది. నిద్రిస్తున్న కొడుకును అలానే ఉంచి స్నానానికి వెళ్లిన కుటుంబసభ్యులు తిరిగి రాగానే చిన్నారి బాలుడు కనిపించకపోవడంతో షాక్‌ అయ్యారు. కుమారుడు కనిపించక పోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు చిన్నారి జాడ కోసం చుట్టుపక్కల గాలించారు. అన్ని ప్రాంతాల్లోని పోలీసులను అలర్ట్‌ చేశారు. సీసీఫుటేజ్‌లో మంకీక్యాప్‌ ధరించిన వ్యక్తి బాలుడిని ఎత్తుకెళ్లే దృశ్యాలు రికార్డు అయ్యాయి. నిద్రిస్తున్న కొడుకును అలానే వదిలేసి స్నానం చేయడానికి వెళ్లిన తల్లిదండ్రుల నిర్లక్ష్యాన్ని పోలీసులు తప్పుబట్టారు. సీసీఫుటేజ్‌ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడి ఫోటోను విడుదల చేయడంతో పాటు దర్యాప్తు ముమ్మరం చేశారు.