తిరుమల శ్రీవారిని దర్శించుకున్న..
శ్రీలంక ప్రధాని దంపతులు
తిరుమల, ఆగస్టు3(జనం సాక్షి) : తిరుమల శ్రీవారిని శ్రీలంక ప్రధాని రాణిల్ విక్రమ సింఘే సతీసమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. మహా ద్వారం గుండా ఆలయ మర్యాదలతో శ్రీవారి ఆలయంలోకి వెళ్లి వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో రాణిల్ విక్రమ సింఘే దంపతులకు వేదపండితులు వేదశీర్వచనం చేశారు. తిరుమల జేఈవో శ్రీనివాసరాజు.. రాణిల్ విక్రమ సింఘే దంపతులకు స్వామి వారి చిత్రపటం తీర్ధ ప్రసాదాలు అందచేసి పట్టువస్త్రంతో సత్కరించారు. అనంతరం విూడియాతో మాట్లాడిన విక్రమసింఘే స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, టీటీడీకి ధన్యవాదాలు తెలిపారు. భారత ప్రభుత్వం పరస్పర సహకారంతో డీప్ సీ ఫిషర్ మెన్ సమస్యలు సానుకూలంగా పరిష్కరమైందని విక్రమసింఘే పేర్కొన్నారు. యునైటెడ్ నేషన్ సెక్యురిటి కౌన్సిల్ లో భారత దేశం సభ్యత్వనికి శ్రీలంక ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు.