తుపాన్‌తో అధికారుల అప్రమత్తం

పోలీస్‌, రెవెన్యూ యంత్రాగం సన్నద్దం
మత్స్యకారులు వేటకు వెళ్లకుండా నిషేధం
కాకినాడ,డిసెంబర్‌15(జ‌నంసాక్షి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు.  తుపాను, భారీ వర్ష సూచన నేపథ్యంలో విపత్తు దాటే వరకూ జిల్లాలోని రైతులు అప్రమత్తంగా ఉండాలని  అధికారులు సూచించారు. వరి పంట పనలపై ఉన్నా, కుప్పలు వేసినా భారీ వర్షాలకు ప్రభావితమయ్యే అవకాశం ఉందని, అందువల్ల నష్టనివారణకు కోతలను నిలిపి వేయాలని కోరారు. వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని ఆదేశించారు. సముద్రంలో వేట నిషేధించారు. ఇప్పటికే వేటకు వెళ్లిన వారిని తిరిగి తీరానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని మత్య్సశాఖ అధికారులను ఆదేశించారు. తుపాను రక్షణ కేంద్రాల్లో అవసరమైన సామగ్రి సిద్ధం చేయాలని తెలిపారు. తుపాను ప్రభావం వల్ల గ్రామాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని, అధికారులకు ప్రజలు సహకరించి సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా సహకరించాలని సూచించారు.
తీరప్రాంత గ్రామాలపై ప్రభావం తుపాను సమయంలో సముద్రంలో అలజడి ఏర్పడి భారీ కెరటాలు ఎగిసిపడితే కోనపాపపేట, సూరాడపేట, మాయాపట్నం గ్రామాలకు ప్రమాదం పొంచి ఉంది. తీరానికి ఆనుకుని ఉన్న గ్రామాలకు రక్షణగా వేసిన జియోట్యూబ్‌ పూర్తిగా ధ్వంసమవడం వల్ల కెరటాలు నేరుగా ఇళ్లల్లోకి చొచ్చుకొస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి వాతావరణంలో మార్పులు వచ్చి గాలుల
తీవ్రత పెరగింది. తుపానును ఎదుర్కొనేందుకు గాను పోలీసు, రెవెన్యూ ఆయా శాఖల అధికారుల సమావేశం నిర్వహించి అప్రమత్తం చేశారు. ప్రభావిత గ్రామాల్లో పోలీసు, రెవెన్యూ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. ప్రమాదకర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వసతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  తాగునీరు, నిత్యావసర సరకులు సిద్ధం చేయాలని సూచించారు. వైద్య శిబిరాలు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. మందులు కొరత లేకుండా చూడాలన్నారు. రాకపోకలకు అంతరాయం ఏర్పడినా వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్తు సరఫరా విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంతం వెంబడి ఉన్న  మండలాల్లో మరింత తీవ్రత ఉండే అవకాశం ఉందని, ఇక్కడ విపత్తులను ఎదుర్కొనేందుకు, సహాయ, పునరావాస చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. మిగిలిన మండలాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, నియోజకవర్గ అభివృద్ధి అధికారులు కార్యస్థానాల్లో ఉండాలని ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ, గ్రావిూణ నీటి సరఫరా, రోడ్లు-భవనాలు, జల వనరులు, అగ్నిమాపక, పౌర సరఫరాలు, తూర్పు విద్యుత్తు పంపిణీ సంస్థ అధికారులతో సవిూక్షించారు. భారీ వర్షాలు కురిస్తే ప్రజలను సహాయ శిబిరాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.