తెరాసలో చేరే వారంతా తెలంగాణ ద్రోహులే: రేవంత్‌రెడ్డి

కరీంనగర్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): వేములవాడ తెరాసలో చేరే వారంతా తెలంగాణ ద్రోహులేనని కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. వేములవాడ ఆరేటి కల్యాణ మండపంలో జరిగిన టిడిపి విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరీంనగర్‌లో మార్చి 3న జరగనున్న చంద్రబాబు సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఓట్ల కోసం కాకుండా ప్రజలను చితన్యవంతులను చేయడానికే ప్రజల్లోకి వస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పట్టుబట్టి పనిచేయిస్తామని ఆయన తెలిపారు. కేసీఆర్‌కు 1200మంది అమరవీరులు గుర్తుకురావడం లేదా… వారిని గుర్తించడానికి ఇంత కాలం పడుతుందా అని ఆయన విమర్శించారు. సమగ్రసర్వేలో తెలంగాణ అమరుల వివరాలను ఎందుకు అడుగలేదని ఆయన ప్రశ్నించారు. పెట్టుబడిదారుల కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని, బడుగు, బలహీన వర్గాలను విస్మరిస్తుందని ఆయన అన్నారు. సెంటిమెంట్‌ పేరిట వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామిని అగౌరవ పరిచారని, శివరాత్రి ఉత్సవాలకు కనీసం మంత్రిస్థాయి నాయకుడైనా పట్టువసౄలు సమర్పించకపోవడం శోచనీయమన్నారు. కరీంనగర్‌ నుంచే కదన రంగాన్ని ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు మోత్కుపల్లి, పెద్దిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు విజయ రమణారావు, నియోజకవర్గ బాధ్యులు గండ్ర నళిని, ఐదు మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు.