తెలంగాణపై కేంద్రానికి మరో లేఖ

ఆదిలాబాద్‌, జూలై 23 : తెలంగాణ ఏర్పాటు విషయమై తెలుగుదేశం పార్టీ వైఖరిని స్పష్టం చేస్తూ అగస్టు నెలలో కేంద్రానికి లేఖను అందజేయనున్నట్లు ఆదిలాబాద్‌ ఎంపీ రమేష్‌రాథోడ్‌ తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి టీడీపీనే ప్రత్యామ్నాయం అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో రోజు ఒక ప్రకటన చేస్తూ కేసీఆర్‌ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌కు ఓటు వేసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, టీఆర్‌ఎస్‌లు కాంగ్రెస్‌లో విలీనం కాకతప్పదని ఆయన అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ప్రధానంగా రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందించకుండా, విద్యుత్‌ కోతలు విధిస్తూ రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యహరిస్తోందని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం తమ పార్టీ ఎన్నో పోరాటాలు చేపట్టిందని అన్నారు.

తాజావార్తలు